Payyavula Challenges Jagan: జగన్.. హంద్రీనీవా కాలువ గట్టుపై చర్చకు సిద్ధమా.. పయ్యావుల సవాల్
ABN , Publish Date - Jul 17 , 2025 | 03:34 PM
Payyavula Challenges Jagan: చంద్రబాబు ఎగిరిపోయే నాయకుడు కాదని.. ఎదిగి పోయే నాయకుడని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. ఎవరు ఎగిరిపోతారో.. ఎవరు ఎదిగిపోతారో చరిత్ర చెబుతోందని అన్నారు. తల్లి చెల్లిని పక్కన పెట్టిన వాడు జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నంద్యాల జిల్లా, జులై 17: సీమ అభివృద్ధిపై దమ్ముంటే జగన్ (YS Jagan) హంద్రీ నీవా కాలువ గట్టుపై చర్చకు రావాలని మంత్రి పయ్యావుల కేశవ్ సవాల్ (Minister Payyavula Keshav) విసిరారు. గురువారం నాడు మల్యాల వద్ద హంద్రీనీవా కాల్వలకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. రాయలసీమ తలరాతను మార్చడానికి అన్న ఎన్టీఆర్ హంద్రీ నీవాకు శ్రీకారం చుట్టారని.. ఆ బాధ్యత చంద్రబాబు పూర్తి చేశారని తెలిపారు. రాయలసీమలో జగన్ పాలెగాళ్ల రాజ్యం తేవాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి అలజడులు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాయలసీమలో కరువు, ఫ్యాక్షన్ నిర్మూలించి.. సాగు నీటితో సస్యశ్యామలం చేస్తున్నారన్నారు.
‘సీమ గడ్డ నుంచే జగన్‌ను నేను ప్రశ్నిస్తున్నాను..జగన్ రాయలసీమకు ఏం చేశాడో చెప్పాలి. హంద్రీనీవా కాలువ గట్టుమీద చర్చకు సిద్ధమా’ అంటూ ఛాలెంజ్ చేశారు. జగన్ నీచ భాష మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎగిరిపోయే నాయకుడు కాదని.. ఎదిగి పోయే నాయకుడని స్పష్టం చేశారు. ఎవరు ఎగిరిపోతారో.. ఎవరు ఎదిగిపోతారో చరిత్ర చెబుతోందని అన్నారు. తల్లి చెల్లిని పక్కన పెట్టిన వాడు జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు జగన్ రాష్ట్రాన్ని చెడగొడితే.. దానిని మొదటి రోజు నుంచి చక్కబెట్టే పనిలో చంద్రబాబు ఉన్నారన్నారు. బనకచర్ల గురించి మాట్లాడిన జగన్.. సీమ ద్రోహిగా మిగిలిపోతున్నారంటూ మంత్రి పయ్యావుల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేశారు: మంత్రి నిమ్మల
హంద్రీ నీవా రాయలసీమకు జీవనాడి అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాయలసీమ మీద చంద్రబాబుకు ఉన్న చిత్త శుద్ధికి ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చారు. 3,850 క్యూసెక్కుల మోటార్లను తాము ఏర్పాటు చేసినా.. జగన్ ఐదేళ్లలో వాటిని ఉపయోగించలేక పోయారన్నారు. రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ చేశారంటూ మండిపడ్డారు. జగన్ ఐదేళ్లలో చేయని పనిని చంద్రబాబు ఒక్క ఏడాదిలో పూర్తి చేసి చూపించారని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హంద్రీ నీవాకు నీరు ఇచ్చారన్నారు. 3,890 కోట్లు ఖర్చు పెట్టి 8 లక్షల ఆయకట్టుకు నీరు అందిస్తున్నారని తెలిపారు. జగన్ రప్పా రప్పా నరుకాతాం అంటూ రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారంటూ మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల కష్టాలు తెలిసిన నేత చంద్రబాబు: ఎంపీ శబరి
ఇంత వరకు ఏ నాయకుడు మల్యాలకు రాలేదని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు చంద్రబాబు అని... అందుకే మొట్టమొదటి సారిగా సీఎం చంద్రబాబు మల్యాలకు వచ్చి హంద్రీ నీవా ప్రాజెక్ట్ నుంచి నీళ్లు విడుదల చేశారని తెలిపారు. అలగనూరు రిజర్వాయర్‌ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల మూలన పడిందని విమర్శించారు. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రాయలసీమ నీటి కష్టాలు తీరుతాయని ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
హంద్రీ - నీవా కాల్వలకు నీరు విడుదల
జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఫైర్
Read Latest AP News And Telugu News