Share News

AP Police Vs Jagan: జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఫైర్

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:56 PM

AP Police Vs Jagan: వైసీపీ ప్రభుత్వంలో కూడా తాము చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారి‌పై కేసులు పెట్టామని.. అరెస్ట్‌లు చేశామని పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు తెలిపారు. పోలీసులను వీఆర్‌లో పెట్టడం అనేది గత ప్రభుత్వంలో చేశారని మండిపడ్డారు.

AP Police Vs Jagan: జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఫైర్
AP Police Vs Jagan

విజయవాడ, జులై 17: పోలీసులను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు ఫైర్ అయ్యారు. జగన్ వ్యాఖ్యలను ఏపీ పోలీసు అధికారులు సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ప్రతీ అంశంలో పోలీసులపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. వైసీపీ నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసు వ్యవస్థ ఉందన్నారు. తనకు రక్షణ కల్పించకుండా కుట్రలు చేస్తున్నారని సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడటం సబబు కాదని విమర్శించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని తెలుసుకోవాలని ఆయన హితవుపలికారు.


డీజీపీని టార్గెట్ చేయడం ఏంటి..

వైసీపీ ప్రభుత్వంలో కూడా తాము చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారి‌పై కేసులు పెట్టామని.. అరెస్ట్‌లు చేశామన్నారు. పోలీసులను వీఆర్‌లో పెట్టడం అనేది గత ప్రభుత్వంలో చేశారని మండిపడ్డారు. ఆరోపణలు వచ్చిన అధికారులపై చర్యలు సహజమని చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత మంది పోలీసులను పక్కన పెట్టారో గుర్తు చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు పోలీసులు వాటాలు పంచుతున్నారని చెప్పడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఐజీ స్థాయి అధికారిని డాన్ అని చెప్పడం సరికాదన్నారు. పోలీసు వ్యవస్థను నడిపే డీజీపీని టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన సారధ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. ఎక్కడో ఒక‌చోట పోలీసు శాఖలో కొన్ని లోపాలు ఉండొచ్చని, పొరబాట్లు జరిగి ఉండవచ్చన్నారు. అలా అని పోలీసులు మొత్తాన్ని కించ పరిచేలా మాట్లాడటం సరికాదని శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు.


చట్ట ప్రకారమే అన్నీ కూడా..

పోలీసులు ఎప్పుడూ ఏ ఒక్కరికో కొమ్ము కాయరని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా చట్ట ప్రకారం తాము‌ పని చేస్తామని వెల్లడించారు. పోలీసుల వల్ల ఇబ్బంది కలిగితే న్యాయ స్థానాల ద్వారా చర్యలు తీసుకోవచ్చన్నారు. రాజకీయాలకు పోలీసు వ్యవస్థ పరువు తీయవద్దని కోరారు. నిబంధనలు ప్రకారం జగన్‌ మోహన్‌ రెడ్డికి భద్రత కల్పిస్తున్నారని తెలిపారు. సిద్ధార్థ కౌశిల్ సొంత కారణాలతో రాజీనామా చేశారని చెప్పారు. ఆ అంశాన్ని డీజీపీకి, ప్రభుత్వానికి ఆపాదించి అబద్దాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలోనూ తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ‌ఉన్నానని.. ఇప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్లు తెలిపారు.


తప్పు చేస్తే ఊచలు లెక్క పెట్టాల్సిందే..

‘మా‌ పోలీసు వ్యవస్థను ఎవరు కించపరిచినా మేము‌ ఇలాగే స్పందిస్తాం. మాకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వానికి వినతులు అందజేస్తున్నాం. ప్రతీ వివాదంలో పోలీసులపై విమర్శలు చేయడం కామన్‌గా మారింది. ఈ‌ విధానం కరెక్ట్ కాదు, మా మనోభావాలను దెబ్బతీసేలా ఎవరూ మాట్లాడవద్దు. పోలీసులకు ప్రత్యేక‌ పీఆర్సీ ఇవ్వాలని నాడు జగన్‌ను, నేడు చంద్రబాబును‌‌ కోరాం. చట్టానికి ఎవరూ చుట్టం‌ కాదు.. తప్పు చేస్తే ఎవరైనా కటకటాలు లెక్క‌ పెట్టాల్సిందే. కొన్ని సినిమాల్లో పోలీసులను విలన్‌లుగా చూపుతున్నారు. ఇటువంటి సన్నివేశాలపై సెన్సార్ బోర్డ్‌కు లేఖ రాశాం. ఈసారి న్యాయస్థానాల్లో కేసులు వేయాలని నిర్ణయించాం’ అని ఏపీ పోలీసు అధికారులు సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

లిక్కర్ కేసులో అసలు బాస్ ఆయనే.. సోమిరెడ్డి హాట్ కామెంట్స్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 17 , 2025 | 04:34 PM