Share News

Liquor Sales: ఫుల్లు కిక్కు!.. భారీగా పెరిగిన మద్యం విక్రయాలు

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:08 PM

Liquor Sales: ఏపీలోని అనంతరపురం జిల్లాలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. గతేడాది కంటే 92 శాతం అధికమని అధికారులు తెలిపారు. బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రావడం, ధరలు తగ్గడమే ఇందుకు కారణమని చెప్పారు.

Liquor Sales: ఫుల్లు కిక్కు!.. భారీగా పెరిగిన మద్యం విక్రయాలు
Liquor Sales Increased In AP

అనంతపురం క్రైం, జూలై 16(ఆంధ్రజ్యోతి): పెగ్గు మీద పెగ్గెయ్... అంటూ మద్యంప్రియులు (Alcohol) పుల్లుగా తాగేశారు. 2025-26 తొలి త్రైమాసికంలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. గతేడాది త్రైమాసికం కంటే.. ఈసారి భారీగా పెరిగాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఏకంగా 6.74 లక్షల కేసుల మద్యం అమ్ముడైంది. ఇందులో లిక్కర్ (Liquor) 4.24 లక్షలు, బీర్ 2.50 లక్షల కేసులు విక్రయించారు. రమారమి రూ.302 కోట్ల విలువైన మద్యం సేల్స్ జరిగాయి.


తొలి త్రైమాసికంలో భారీగా...

అనంతపురం (Ananthapur), గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, కంబదూరు, కణేకల్లు, రాయదుర్గం, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పెద్దఎత్తున లిక్కర్, బీర్ (Beers) కేసులు విక్రయించారు. అనంతపురం ఎక్సైజ్ సర్కిల్ 2.15 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. గతేడాది 3.51 లక్షల కేసుల మద్యం మాత్రమే విక్రయించారు. 2024 ఏప్రిల్, మే, జూన్ త్రైమాసికంలో లిక్కర్ 2.55 లక్షల కేసులు, బీర్ 95,631 కేసులు అమ్ముడయ్యాయి. మొత్తంగా 3.51 లక్షల లిక్కర్, బీర్ కేసులు విక్రయించారు. తద్వారా రూ.226.47 కోట్ల విలువైన మద్యం వ్యాపారం సాగింది. గతేడాది కంటే ఈసారి తొలి త్రైమాసికంలో భారీగా అమ్మకాలు పెరిగాయి. గతేడాది కంటే లిక్కర్ 66.08 శాతం, బీర్ 161.66 శాతం విక్రయాలు పెరగడం గమనార్హం. మొత్తంగా ఈ ఏడాది 92.08 శాతం అధికంగా విక్రయాలు సాగాయి.


బీర్లు పొంగించారు....

ఈ ఏడాది బీర్లు ఉప్పొంగాయి. యువత, మధ్యవయసు వారు భారీగా బీర్ల కొనుగోలుకు ఉత్సాహం చూపారు. గతేడాది 95,631 కేసులు మాత్రమే అమ్ముడు పోగా.. ఈసారి ఏకంగా 2.55 లక్షల కేసులు దాటించారు. అత్యధికంగా కంబదూరు సర్కిల్లో బీర్ల కోనుగోళ్లు ఊపందుకున్నాయి. గతేడాది కేవలం 915 కేసులు అమ్ముడు కాగా.. ఈసారి ఏకంగా 6,747 విక్రయాలతో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో శింగనమల నిలిచింది. శింగనమల సర్కిల్లో 247.68 శాతం, కళ్యాణదుర్గం 226.54 శాతం అమ్మకాలు జరిగాయి. అనంతపురం కూడా వీర్ల అమ్మకాల్లో ఈ మూడు సర్కిళ్ల కంటే వెనుకబడటం గమనార్హం. గతేడాది కంటే ఈసారి బీర్ల అమ్మకాలు 161.66 శాతం పెరిగాయని చెప్పవచ్చు.


Also Read:

అనగనగా ఒక ఊరు.. ప్రజలే లేరు..!

లిక్కర్ కేసులో అసలు బాస్ ఆయనే.. సోమిరెడ్డి హాట్ కామెంట్స్

Updated Date - Jul 17 , 2025 | 12:08 PM