Big Shock To Vamsi: వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు
ABN , Publish Date - Jul 17 , 2025 | 12:07 PM
Big Shock To Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాకిచ్చింది సుప్రీం కోర్టు. అక్రమ మైనింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం తప్పుబట్టింది.

న్యూఢిల్లీ, జులై 17: అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Former MLA Vallabhaneni Vamsi) సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టేసింది. ఈ కేసులో వంశీకి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం తప్పుబట్టింది.
ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. కేసు మెరిట్స్‌లోకి, పీటీ వారెంట్స్‌లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఇరువురు వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టును ఆదేశించింది సుప్రీం. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. కోర్టుకు చెప్పారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన నాలుగు వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ఏపీ హైకోర్టును సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.
కాగా.. ఫిబ్రవరి 16న హైదరాబాద్‌లో ఉన్న వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్థన్ కిడ్నాప్ కేసు, భూ కబ్జా, నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఇలా వివిధ కేసుల్లో దాదాపు 137 రోజుల పాటు జైలులో ఉన్న వంశీ ఇటీవలే విడుదలయ్యారు. ఆయనపై నమోదైన కేసుల్లో కొన్నింటికి ముందుస్తు బెయిల్, మరికొన్ని కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ లభించడంతో ఈనెల 2న వంశీ విజయవాడ జైలు నుంచి బయటకు వచ్చారు.
ఇవి కూడా చదవండి..
లిక్కర్ కేసులో అసలు బాస్ ఆయనే.. సోమిరెడ్డి హాట్ కామెంట్స్
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడ్డ మంటలు
Read Latest AP News And Telugu News