Buddha Venkanna: సజ్జల జైలుకెళ్లడం ఖాయం.. బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్
ABN , Publish Date - Nov 26 , 2025 | 01:20 PM
రైతుల మీద మొసలికన్నీరు కారుస్తున్న సజ్జల గత ఐదేళ్లల్లో ఏం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రశ్నల వర్షం కురిపించారు. గంజాయిని సాగు చేయించి కోట్లు దండుకున్నారని ఆరోపించారు. జగన్ అండ్ కో పాల్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
విజయవాడ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్టి (Sajjala Ramakrishna Reddy)పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల మళ్లీ నోటి దూల మొదలెట్టారని.. వైసీపీలో ఆయన శకుని, శూర్పణక లాంటి వారని సెటైర్లు గుప్పించారు. సజ్జల గురించి విజయసాయి రెడ్డి ఎప్పుడో చెప్పారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబుపై కేసులు ఉన్నట్లు సజ్జల చెప్పడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు బుద్దా వెంకన్న.
వైసీపీకి బుద్ధి చెప్పారు..
వైఎస్సార్ సీఎంగా ఉండగా అనేక విచారణలు చేసినా చంద్రబాబుపై ఎలాంటి తప్పులను చూపలేకపోయారని గుర్తుచేశారు. పిల్ల కాకి అయిన జగన్ మోహన్‌రెడ్డికు ఉండేల్ దెబ్బ ఏం తెలుసు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై అన్యాయంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేసులు పెట్టారని మండిపడ్డారు. ఆ సమయంలో ప్రజలే చంద్రబాబుకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. 151 నుంచి 11సీట్లతో ప్రజలు వైసీపీని ఓడించి బుద్ధి చెప్పారని విమర్శలు చేశారు. ఇవాళ(బుధవారం) విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బుద్దా వెంకన్న.
రైతుల మీద మొసలికన్నీరు..
‘రైతుల మీద మొసలికన్నీరు కారుస్తున్న సజ్జల గత ఐదేళ్లల్లో ఏం చేశారు. గంజాయిని సాగు చేయించి కోట్లు దండుకున్నారు. జగన్ అండ్ కో పాల్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం కలనే. వైసీపీ నాశనం అవడానికి సజ్జల మూల కారణమని మీ నాయకులే చెబుతున్నారు. మద్యం ద్వారా పేదల ప్రాణాలు బలి చేశారు. కోట్ల రూపాయలు దోచుకున్నారు కాబట్టే కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. త్వరలోనే నీ పాత్ర బయటకు వస్తుంది.. నువ్వు జైలుకు వెళ్తావు. ర్యాలీలు, విదేశాలకు వెళ్లే జగన్.. కోర్టుకు వెళ్లమంటే అనారోగ్యం అంటారు. మొన్న కోర్టు మొట్టికాయలు వేస్తే హాజరయ్యారు. విజయసాయి రెడ్డి మీపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పే దమ్ము ఉందా. నువ్వు అధికారంలోకి వస్తే చంద్రబాబు సంగతి చూస్తావా. ఏంటి నువ్వు చూసేది... నువ్వు చేసిన ఘోరాలు బయటకు వస్తున్నాయి’ అని బుద్దా వెంకన్న హెచ్చరించారు.
జగన్‌కు వ్యవసాయం తెలుసా...
‘వల్లభనేని వంశీ, జోగి రమేశ్ వెనుక నువ్వే ఉన్నావు. తప్పకుండా సూత్రధారిగా నువ్వు జైలుకు వెళ్తావు. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా. జగన్‌కు అసలు వ్యవసాయం తెలుసా... ఫ్యాక్షనిజం మాత్రమే తెలుసు. చంద్రబాబు రైతు బిడ్డ.. అన్నదాతల కష్టాలు ఆయనకే తెలుసు. చంద్రబాబును అన్యాయంగా టచ్ చేస్తేనే మీకు దూల తీరింది. మీ పార్టీ అడ్రసును ప్రజలే గల్లంతు అయ్యేలా చేశారు. మళ్లీ చంద్రబాబును టచ్ చేసే దమ్ము , ధైర్యం ఎవరికైనా ఉన్నాయా. వైసీపీ ఖాళీ అయిపోవడం ఖాయం... ఆపార్టీ నేతలు పాల్ పార్టీలోకి వెళ్లి పోతున్నారు. సజ్జల... నువ్వు ముందు మీ పార్టీ నాయకుల సంగతి చూసుకో. చంద్రబాబు సంగతి చూసే దమ్ము నీకు, నీ జగన్‌కు లేదు. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం కావడం ఖాయం. మీడియా ఉంది కదా అని నోటికొచ్చినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి మా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తగిన బుద్ది చెబుతాం. వైసీపీ ప్రభుత్వంలో వెనక ఉండి అనేక దాడులు, దారుణాలు చేయించింది నువ్వే. త్వరలోనే అవన్నీ బయటకు వస్తాయి. సజ్జల జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉండాలి’ అని బుద్దా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్యాంగ విలువలను కాపాడుకుంటాం:సీఎం చంద్రబాబు
మాక్ అసెంబ్లీ అద్భుతం.. విద్యార్థులు అదరగొట్టారు: సీం చంద్రబాబు
Read Latest AP News And Telugu News