CM Chandrababu: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తోక కట్ చేస్తా: సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Aug 01 , 2025 | 03:51 PM
ఎన్టీఆర్ ఆలోచన నుంచే రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టామని తెలిపారు. త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తి చేసి చెరువులన్నీ నింపుతామని స్పష్టంచేశారు.

కడప: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అసభ్యంగా మాట్లాడిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలని జగన్ సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రసన్నని జగన్ పరామర్శించడం ఏంటనీ ధ్వజమెత్తారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి.. ఖండించాలని హితవు పలికారు. నల్లపురెడ్డిని మందలించాల్సింది పోయి.. జగన్ ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. మహిళలపై ఇంకా విరుచుకుపడాలనే ధోరణిలోనే జగన్ వైఖరి ఉందని మండిపడ్డారు. నాయకుడే రెచ్చగొడితే కిందిస్థాయి నేతలు ఇష్టానుసారం మాట్లాడరా? అని నిలదీశారు సీఎం చంద్రబాబు.
జగన్ అండ్ కో లాంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరమా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తోక కట్ చేస్తానని హెచ్చరించారు. ఇటీవల బంగారుపాళ్యంలో జగన్ పర్యటన దృశ్యాలను.. నెల్లూరులో ఆయన పర్యటనకు వచ్చినట్లుగా చూపించారని విమర్శించారు. వితండవాదం చేయడంలో వైసీపీ నేతలు ఎప్పుడూ ముందుంటారని ఆరోపించారు. ప్రతి చోటా డ్రోన్లు పర్యవేక్షిస్తున్నాయని.. తస్మాత్ జాగ్రత్త అంటూ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కడప జిల్లా జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు ఇవాళ(శుక్రవారం ఆగస్టు 1) పర్యటించారు. గూడెంచెరువులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గూడెంచెరువు గ్రామం నుంచి ప్రజావేదిక వద్దకు ఆటోలో పెళ్లారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో ఆటో కార్మికుడికి బాడుగ ఇవ్వగా.. చంద్రబాబుకు ఆటోవాలా పాదాభివందనం చేశారు. అనంతరం గూడెంచెరువులో సీఎం చంద్రబాబు పేదల సేవలో ప్రజావేదిక బహిరంగసభలో ప్రసంగించారు.
ఎన్టీఆర్ ఆలోచన నుంచే రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసినట్లు సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టామని చెప్పుకొచ్చారు. త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తిచేసి చెరువులన్నీ నింపుతామని స్పష్టం చేశారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే కరవు అనేదే ఉండదని వివరించారు. రాయలసీమకు పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. త్వరలోనే కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. 2028 డిసెంబర్ నాటికి స్టీల్‌ప్లాంట్ తొలిదశ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. రేపు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు ఇవ్వబోతున్నాయని స్పష్టం చేశారు. మొత్తంగా రైతులకు రూ.20 వేలు ఇవ్వబోతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ సమావేశానికి కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత, టీడీపీ ఎమ్మెల్యేలు, P4 బంగారు కుటుంబాల మార్గదర్శకులు, చేనేతలు, ప్రజలు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోవూరులో ఉద్రిక్తత.. క్షమాపణలు చెప్పాలంటూ మహిళల డిమాండ్
For More AP News and Telugu News