Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుఫాను.. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ
ABN , Publish Date - Nov 30 , 2025 | 04:18 PM
దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోందని వివరించారు.
విశాఖపట్నం, నవంబరు30 (ఆంధ్రజ్యోతి): దిత్వా తుఫాను (Ditwah Cyclone) నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోందని వివరించారు. తుఫాను పుదుచ్చేరికి 110 కిలోమీటర్లు, చెన్నైకు దక్షిణ - ఆగ్నేయంగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని.. ఇప్పుడు తీరాన్ని అనుకొని కొనసాగుతోందని వెల్లడించారు.
తమిళనాడు - పుదుచ్చేరి తీరప్రాంతం నుంచి ఈరోజు(ఆదివారం) కనీసం 60 కిలోమీటర్లు.. సాయంత్రం నాటికి 30 కిలోమీటర్ల దూరం వరకు పయనిస్తోందని చెప్పుకొచ్చారు. తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో చెదురుముదురుగా అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. ఈ రోజు దక్షిణ కోస్తా తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూల్, కడపకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ప్రకటించారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తా పోర్టులకు మూడో నెంబర్, ఉత్తర కోస్తా పోర్టులకు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసం: మంత్రి నిమ్మల
Read Latest AP News and National News