Rain Alert in AP: రెయిన్ అలర్ట్.. అల్పపీడన ప్రభావంతో వర్షాలు
ABN , Publish Date - Nov 21 , 2025 | 06:40 PM
వాతావరణంలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
అమరావతి, నవంబరు21(ఆంధ్రజ్యోతి): వాతావరణంలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో ఏపీ (Andhra Pradesh)లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపటి(శనివారం)కి దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇది పశ్చిమ - వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమవాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని వివరించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం (22-11-25) ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు పేర్కొన్నారు. వర్షాల దృష్ట్యా ప్రజలు, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూముల రీ సర్వే చేయండి: రఘురామ
విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
Read Latest AP News And Telugu News