Pawan Kalyan: నాసిరకం మద్యంతో ప్రాణాలు తీశారు.. జగన్‌పై పవన్ కల్యాణ్ ఫైర్
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:59 PM
తమ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. రాజధాని భూ సమీకరణపై తన నిర్ణయాన్నిఇప్పటికే సీఎం చంద్రబాబుకి చెప్పానని తెలిపారు.

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం నిషేధిస్తామని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చి ఏం చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం మద్యం ఏరులై పారించిందని ఆరోపించారు. మద్య నిషేధం నినాదంతో అధికారంలోకి వైసీపీ వచ్చిందని.. కానీ ఆ హామీని జగన్ మర్చిపోయారని మండిపడ్డారు. అనేక మందికి నాసిరకం మద్యంతో లివర్ దెబ్బ తిని ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు. ఇవాళ(మంగళవారం) ఏపీ సచివాలయంలో పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ కార్యాలయానికి అనేక మంది బాధితులు వచ్చారని.. ఇప్పుడు మద్యం కుంభకోణంలో అనేక మంది అరెస్టు అవుతున్నారని తెలిపారు. ఒకవైపు నిధులు తినేశారు.. మరోవైపు జనం ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు పవన్ కల్యాణ్.
అయినా ఇంకా బెదిరింపుల ధోరణితో జగన్, వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ఇటువంటి కాగితపు బెదిరింపులకి ఎవరూ భయపడరని.. ఇలాంటి తాటాకు చప్పుళ్లు చాలా చూశామని హెచ్చరించారు. ఎన్నో పోరాటాలు చేసి ఇక్కడ నిలబడ్డామని... ఇంతటి ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చామని ఉద్ఘాటించారు. అవినీతి, అడ్డగోలుగా వ్యవహారించి కూడా ఇంకా ఎందుకు అరుస్తున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వారి అరుపులను పట్టించుకోదని చెప్పుకొచ్చారు. వాళ్లు రప్పా రప్పా అంటే తాము మెడలు కోయించుకోవడానికి సిద్ధంగా లేమని హెచ్చరించారు. వాళ్లు కోస్తామంటే తాము మరోవైపు నుంచి మెడ చూపిస్తామా..? అని ప్రశ్నించారు. ఇక్కడ ఎవరూ అంత తేలికగా లేరని వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.
రాజధాని అమరావతి భూ సమీకరణపై తన నిర్ణయాన్నిఇప్పటికే సీఎం చంద్రబాబుకి చెప్పానని.. సీఎం కూడా తన అభిప్రాయంతో ఏకీభవించారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. అందరిని ఒప్పించి వాళ్లను కూడా భాగస్వాములుగా చేసి ముందుకు వెలుదామని చెప్పానని.. అందుకు సీఎం కూడా ఒప్పుకున్నారని తెలిపారు. మనం అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. అందుకనే వివాదాలు చేయకూడదని చెప్పానని అన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని ఉద్ఘాటించారు. మంచి సినిమా కథలు వస్తే నిర్మాతగా వ్యవహారిస్తానని.. ఈ అంశాలన్నీ కూడా సీఎం చంద్రబాబుకు కూడా చెప్పానని గుర్తుచేశారు. సీఎంకు చెప్పిన అనంతరేమే సినిమాల గురించి నిర్ణయాలు తీసుకున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు
For More AP News and Telugu News