Ditwah Cyclone: రేపు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. జాగ్రత్త సుమీ!
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:43 PM
దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
అమరావతి, నవంబరు29 (ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో దిత్వా తుఫాను (Ditva Cyclone) ప్రభావం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతానికి ఇది కారైకాల్‌కి 150 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 280 కిలోమీటర్లు, చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిందని వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతుందని వివరించారు.
ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్న తుఫాను చెన్నైకి అతి సమీపానికి వస్తుందని వివరించారు. ఈరోజు రాత్రికి తుపాను 60కిలోమిటర్ల వరకు ప్రయాణిస్తుందని చెప్పుకొచ్చారు. తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తూ ఆయా ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. మూడు రోజుల్లో ఏపీలో కొన్నిచోట్ల భారీ, మరికొన్ని చోట్ల అతి భారీ, ఇంకొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రెండు రోజుల వరకు తుఫాను తీరం దాటే పరిస్థితి లేదని అన్నారు. తీరం దాటకుండానే తుఫాను క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
రేపు(ఆదివారం)తెల్లవారుజామునకు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. తుఫాను ప్రభావంతో ఇవాళ(శనివారం) చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. తుఫాను ప్రభావం దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని కోరారు. మూడు రోజులపాటు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.
ఈ జిల్లాలకు తుఫాను హెచ్చరికలు..
ఈరోజు(శనివారం) ఆరెంజ్ అలర్ట్: నెల్లూరు, తిరుపతి, చిత్తూరు
ఎల్లో అలర్ట్: ప్రకాశం, కడప, అన్నమయ్య
రేపు(ఆదివారం) రెడ్ అలర్ట్: నెల్లూరు, తిరుపతి, చిత్తూరు
రేపు ఆరెంజ్ అలర్ట్: ప్రకాశం, కడప, అన్నమయ్య
రేపు ఎల్లో అలర్ట్ : గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి
డిసెంబరు 1వ తేదీన ఆరంజ్ అలర్ట్: ప్రకాశం, నెల్లూరు
ఎల్లో అలర్ట్ : ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం
వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం: త్రీ మెన్ కమిటీ
Read Latest AP News And Telugu News