CM Chandrababu: గడ్కరీ అంకితభావం, చిత్తశుద్ధి చాలా గొప్పవి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 02 , 2025 | 09:03 PM
గడ్కరీలో వేగం, అంకిత భావం, చిత్తశుద్ది ఆయనకు మాత్రమే సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టితో రోడ్లకు రూపం ఇస్తే దాన్ని గడ్కరీ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.

అమరావతి: అభివృద్ధి, నాగరికతకు రహదారులు చిహ్నమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) ఉద్ఘాటించారు. పోలవరానికి కేంద్రమంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ అండదండలు ఎప్పటికీ మరిచిపోలేమని కొనియాడారు. గడ్కరీ అంకితభావం, చిత్తశుద్ధి చాలా గొప్పవని ప్రశంసించారు. గడ్కరీ హయాంలో అనేక హైవేలు పూర్తయ్యాయని కీర్తించారు. అసాధ్యమనుకున్న ప్రాజెక్టులనూ గడ్కరీ పూర్తిచేశారని చెప్పుకొచ్చారు. ముంబై నుంచి పుణె మధ్య తొలి పీపీపీ మోడల్ రోడ్ నిర్మించారని తెలిపారు. ప్రపంచంలోనే మెరుగైన రోడ్ల వ్యవస్థ భారత్ సొంతమని వ్యాఖ్యానించారు. గడ్కరీ చొరవతో రోజుకు 37 కిలోమీటర్ల హైవేల నిర్మాణం పూర్తి చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇవాళ(శనివారం ఆగస్టు 2) మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో పలు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేశారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.
ఏపీకి మరో 20 పోర్టులు
ఏపీకి మరో 20 పోర్టులు రాబోతున్నాయని వివరించారు సీఎం చంద్రబాబు. అపారమైన నీటి వనరులు ఏపీ సొంతమని ఉద్ఘాటించారు. ప్రపంచస్థాయి లాజిస్టిక్ హబ్స్ తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. విశాఖపట్నం, విజయవాడకు మెట్రో ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని గుర్తుచేశారు. అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మీదుగా బుల్లెట్ రైళ్లు కావాలని సూచించారు. బుల్లెట్ రైళ్ల ద్వారా నాలుగు కోట్లమంది ప్రయాణికులకు లబ్ధి కలుగుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో 189 కిలోమీటర్ల పొడవైన ఓఆర్‌ఆర్ అడిగామని తెలిపారు. ఏపీ అడిగిన ప్రాజెక్టులపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని.. హైవేల పక్కన పచ్చదనం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్‌లో డ్రైవర్లు లేని వాహనాలు వస్తాయని వెల్లడించారు. అంతర్గత జలరవాణా మార్గాల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టామని చెప్పారు. ఏపీకి మరిన్ని డ్రై పోర్టులు రాబోతున్నాయని ప్రకటించారు. బయో ఇంధనం ఉత్పత్తిలోనూ వేగంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.
రోడ్లు బాగుండాలి..
‘ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టితో రోడ్లకు రూపం ఇస్తే దాన్ని గడ్కరీ ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు ఆరు ప్రాజెక్టులు నితిన్ గడ్కరీ అనౌన్స్ చేశారు. భవిష్యత్తులో రోజుకు 50 కిలోమీటర్ల రహదారులు మీ ఆధ్వర్యంలో నిర్మాణం అవుతాయి. గడ్కరీలో వేగం, అంకిత భావం, చిత్తశుద్ది ఆయనకు మాత్రమే సాధ్యం. రోడ్లు గురించే కాకుండా రోడ్లపై జరిగే యాక్సిడెంట్ల గురించి కూడా ఆయన ఆలోచించడం చూశాం. పొల్యూషన్ లేకుండా ఉండేందుకు ఎలక్ట్రికల్ వెహికిల్స్ రావాలి. ఆ తర్వాత గ్రీన్ హైడ్రోజన్ రావాలి. సాగర్ మాల, భారత్ మాల లాంటి ప్రాజెక్టులు ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. నెల్లూరు నుంచి తిరుపతికి గతంలో 10 గంటలు పట్టేది. ఏపీలో ఐదేళ్లు జగన్ హయాంలో రోడ్లు విధ్వంసం అయ్యాయి. ఏపీలో 4,300 కిలోమీటర్లు ఉంటే 5 సంవత్సరాల్లో 8,700 కిలోమీటర్లు పెంచే ప్రయత్నం గతంలో చేశాం. రూ.11వేల కోట్లతో 760 కిలోమీటర్లు ఒక్క ఏడాదిలో పూర్తిచేశాం. ఏపీలో ల్యాండ్ అక్విజేషన్ సమస్య లేదు. కేంద్రం ఆదేశిస్తే యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తిచేస్తాం. రూ.15,000 కోట్లతో 1,000 కిలోమీటర్లు ఈ సంవత్సరం పూర్తిచేస్తాం. రవాణా ఖర్చులు మన దగ్గర తగ్గాలంటే లాజిస్టిక్ పెరగాలి. పోర్టులు, రోడ్లు బాగుండాలి. అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వం రూ.2వేలు, ఏపీ రూ.5వేలను రైతుల ఖాతాల్లో వేశాం. సూపర్ సిక్స్ సంక్షేమ కార్యకమ్రాలు, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభవ ద్వారా రైతులను ఆదుకున్నాం. ఆ రైతులు పంట అమ్ముకొని డబ్బు సంపాదనకు ఈ రోడ్లు ఉపయోగపడుతాయి. సూపర్ సిక్స్‌లో మెజార్టీ పూర్తిచేశాం. ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు అమలు చేస్తాం. హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో ఏపీలో 20 పోర్టులు తయారు చేస్తాం. ఎయిర్ పోర్టులు విషయంలో మరో 9 ఎయిర్ పోర్టులు సిద్ధం కావాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి అయినా గంటలో వెళ్లాలి’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు..
‘ఇన్ ల్యాండ్ వాటర్ వేస్‌ను ప్లాన్ చేస్తే గత జగన్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. బకింగ్ హం కెనాల్‌తో కాకినాడ నుంచి చెన్నైకి సరకుల రవాణా రూటు ఏర్పాటు చేయాలనుకున్నాం. 2000 సంవత్సరంలో 167 కిలోమీటర్లతో రోడ్లు వేశాం. దీంతో హైదరాబాద్ బాగా అభివృద్ధి జరిగింది. దాని స్పూర్తిగా 187 కిలోమీటర్లు అమరావతి రింగ్ రోడ్డును కోరగా.. గడ్కరీ హమీ ఇచ్చారు. ఈ రోడ్డుతో 7 నేషనల్ హైవేలని కనెక్ట్ చేస్తాం. నాగపూర్ హైవే కూడా కనెక్ట్ అవుతుంది. గ్రీన్ హైడ్రోజన్ గురించి, గ్రీన్ ఎనర్జీ గురించి గడ్కరీ చెప్పారు. సూర్యఘర్ కింద ఇంటిపైనే ఎస్సీలు, ఎస్టీలు విద్యుత్ ఉత్పత్తి చేసేలా కార్యక్రమం ఏర్పాటు చేశాం. బీసీలకు 3 కిలోవాట్స్‌కు రూ.93వేలు సబ్సిడీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. బయో ప్యూయల్ విషయంలోనూ ముందుకు వెళ్తున్నాం. వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు సాకారం కావాలంటే మౌలిక వసతులపై శ్రద్ధ పెట్టాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి క్లియర్ విజన్, మంచి ఆలోచనలు ఉన్నాయి.. ప్రధాని ఆలోచనలు అమలు చేయడానికి నేను, గడ్కరీ, పవన్ కల్యాణ్ ఉన్నాం. త్వరలోనే చైనా అమెరికాతో మనం పోటీ పడతాం. గడ్కరీ అందరూ ఎంపీలు అడిగిన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని ఫలితంగా నేషనల్ హైవే ఎక్కితే గమ్యస్థానాలకు వాహనదారులు వేగంగా చేరే అవకాశం వస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు వస్తున్నాయి. త్వరలోనే డ్రైవర్ లెస్ వాహనాలూ వస్తాయి. మహారాష్ట్రతోపాటు ఏపీని మీరు మీ సొంత రాష్ట్రంగా భావించాలి. మహారాష్ట్రతో పాటు ఏపీని కూడా అభివృద్ధి చేయండి. ఏపీకి రెండు రోప్ వేస్ ఇప్పటికే అమలు చేశారు. గడ్కరీ మరో నాలుగు కూడా అమలు చేస్తామంటున్నారని’ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్‌బాస్ అరెస్ట్ ఖాయం
Read Latest AP News and National News