CM Chandrababu: సింగపూర్‌తో కొత్త అధ్యాయానికి శ్రీకారం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 28 , 2025 | 12:19 PM
ఏపీ రాజధాని అమరావతి అనేది కొత్త ఆలోచనలతో, అధునిక వసతులతో నిర్మాణం అవుతున్న కొత్తనగరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. కొత్త నగరం నిర్మాణం అనేది మంచి అవకాశమని, ఉత్తమ విధానాలు, అనుభవాలను ఉపయోగించి కొత్త నగరాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. సింగపూర్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందనీ.. నిర్మాణంలో వరల్డ్ బ్యాంక్ కూడా భాగస్వామి అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

అమరావతి: నాలెడ్జ్ ఎకానమీలో ఏపీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్‌మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని కోరారు. ఇవాళ(సోమవారం జులై 28) సింగపూర్‌లో సీఎం చంద్రబాబు బృందం రెండో రోజు పర్యటించారు. సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు నారాలోకేష్, నారాయణ, టీజీ భరత్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్‌తో సీఎం చర్చించారు. రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని స్పష్టం చేశారు. సింగపూర్‌పై అభిమానంతో గతంలో హైదరాబాద్‌లో.. సింగపూర్ టౌన్‌షిప్ నిర్మించామని తెలిపారు. నవంబర్‌లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు. సింగపూర్‌ను చూసే హైదరాబాద్‌లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
డేటా సెంటర్ల ఏర్పాటులోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమని సూచించారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని.. ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని ఉద్ఘాటించారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో సింగపూర్ సహకరించాలని కోరారు. గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు సీఎం చంద్రబాబుని కలిశానని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ గుర్తుచేసుకున్నారు. గ్రీన్ ఎనర్జీ, సబ్‌సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ వివరించారు. గృహ నిర్మాణ రంగంలోనూ ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని తెలిపారు.
కాగా, సింగపూర్‌లో 10 వేల కటుంబాలు నివాసం ఉండే బిడదారి ఎస్టేట్‌లో రెండు గంటల పాటు కాలి నడకన సీఎం చంద్రబాబు బృందం పర్యటించారు. సిటీ ఇన్ ఏ గార్డెన్ పేరుతో ఏర్పాటైన హౌసింగ్ ప్రాజెక్ట్ విశిష్టతలను ముఖ్యమంత్రికి వివరించారు సింగపూర్ అధికారులు. బిడదారీ హౌసింగ్ ప్రాజెక్ట్‌ని సింగపూర్ హౌసింగ్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారులు తీర్చిదిద్దారు. పట్టణ, నగర ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో నాణ్యమైన నివాస గృహాల నిర్మాణంపై సీఎం చంద్రబాబు చర్చించారు. 250 ఎకరాల్లో విస్తరించిన సింగపూర్ ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్ట్‌ని సందర్శించారు సీఎం బృందం. 10 వేల కుటుంబాలు నివాసం ఉండేలా అన్ని వసతులతో పర్యావరణ హితంగా నివాస సముదాయాన్ని నిర్మించింది సింగపూర్ ప్రభుత్వం. శ్మశాన ప్రాంతాన్ని సుందరమైన పార్క్‌గా మార్చింది సింగపూర్ అర్బన్ రీ డెవలప్‌మెంట్ అథారిటీ. అర్బన్ హౌస్ ప్లానింగ్‌లో భాగంగా బిడదారి ఎస్టేట్‌లో సీఎం బృందం పర్యటించింది.
చెట్లు తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా నిర్మాణాలు చేపట్టిన విధానాన్ని వివరించారు సింగపూర్ అధికారులు. అనంతరం సింగపూర్ హౌసింగ్ డెవలప్‌మెంట్ బోర్డు, సింగపూర్ అర్బన్ రీ డెవలప్‌మెంట్ అథారిటీ, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ ప్రైజ్‌తో సహా ప్రపంచ బ్యాంకు అధికారులతో సీఎం బృందం సమావేశమయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న విధానాలు, ఆలోచనలు, ప్రణాళికలను వారితో పంచుకున్నారు సీఎం చంద్రబాబు బృందం. ఏపీలో చేపట్టనున్న అర్బన్ హౌసింగ్ ప్రాజెక్ట్‌ల్లో సింగపూర్ సహకారంపై సమావేశంలో చర్చించారు. బిడదారి ప్రాజెక్ట్‌ని రూపొందించిన విధానం చాలా గొప్పగా ఉందని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. పర్యావరణం దెబ్బతినకుండా చేపట్టిన అర్బన్ ప్రాజెక్ట్ అద్భుతంగా ఉందని సీఎం చంద్రబాబు బృందం కొనియాడారు.
ఏపీ రాజధాని అమరావతి అనేది కొత్త ఆలోచనలతో, అధునిక వసతులతో నిర్మాణం అవుతున్న కొత్తనగరమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. కొత్త నగరం నిర్మాణం అనేది మంచి అవకాశం, ఉత్తమ విధానాలు, అనుభవాలను ఉపయోగించి కొత్త నగరాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. సింగపూర్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందనీ.. నిర్మాణంలో వరల్డ్ బ్యాంక్ కూడా భాగస్వామి అవుతోందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. గతంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా సింగపూర్ - ఏపీ ప్రభుత్వాల మధ్య కొన్ని సమస్యలు వచ్చాయని సీఎం గుర్తుచేశారు. కొన్ని నిర్ణయాల కారణంగా రాష్ట్రం నమ్మకాన్ని కోల్పోయిందనీ.. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడానికి తాను సింగపూర్ వచ్చాననీ తెలిపారు. ఏపీలో, అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్ట్‌ల్లో భాగస్వాములు కావాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్‌మెంట్ బోర్డును ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ లిక్కర్ స్కాం ఢిల్లీ స్కాం కంటే పెద్దది: మంత్రి నిమ్మల
రాష్ట్రంలో పాజిటివ్ గవర్నెన్స్: మంత్రి సత్యప్రసాద్
Read latest AndhraPradesh News And Telugu News