Nimmala Ramanaidu Fires ON BRS: బీఆర్ఎస్ నేతలు తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.. మంత్రి నిమ్మల ఫైర్
ABN , Publish Date - Aug 01 , 2025 | 09:56 PM
తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోవాలనే దురుద్దేశాలు తమకు అప్పుడు, ఇప్పుడు లేవని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తెలుగు ప్రాంతాలు, తెలుగు ప్రజలు బాగుండాలి అన్నది తెలుగుదేశం పార్టీ విధానమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

పశ్చిమగోదావరి: పోలవరం - బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) క్లారిటీ ఇచ్చారు. 1975 నుంచి 1924 సంవత్సరాల మధ్య 50 సంవత్సరాల్లో 1,53,000 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి పోయిందని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు వచ్చిన వరద నీటిని ఆంధ్రప్రదేశ్ మాత్రమే వాడుకోవాలని లేదా సముద్రంలోకి పోతోందని వెల్లడించారు. ఈ సంవత్సరం ఇప్పటికే 600 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయిందని తెలిపారు. శబరి, సీలేరు నుంచి 600 టీఎంసీలు నీరు పోలవరానికి వస్తుందని వివరించారు. ఉప్పునీటిలో కలిసే నీటిని మాత్రమే కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్తామని వెల్లడించారు. ఇవాళ(శుక్రవారం) పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం, సీతారామసాగర్, సమ్మక్క సాగర్, బసవేశ్వర, ఎస్సార్‌ఎస్పీ, గౌరవెల్లి ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతి లేకుండానే తెలంగాణ ప్రభుత్వం పనులు చేపట్టలేదా అని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు పాటించని నిబంధనలు ప్రాథమిక దశలోనే ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడటం సమంజసమేనా అని నిలదీశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బనకచర్లపై బీఆర్‌ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్నదమ్ముళ్లాంటి తెలుగు ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆ రోజు గోదావరి నీటిని రాయలసీమకు తీసుకువస్తానని చెప్పింది కేసీఆర్ కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి నిమ్మల రామానాయుడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణ 444 టీఎంసీల సామర్థ్యం గల కాళేశ్వర, సీతారామ సాగర్, సమ్మక్క, బసవేశ్వర, గౌరవెల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఎస్సార్‌ఎస్పీ ప్రాజెక్టుల నిర్మాణం చేసినా ఏపీ అడ్డుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు గుర్తుచేశారు. 2016 అపెక్స్ కౌన్సిల్ నందు కృష్ణా బేసిన్‌కు 1000 టీఎంసీల నీరు కొరత ఉందని... గోదావరి వరద నీరు అందించాలని చెప్పలేదా అని నిలదీశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పి, నేడు మాట మార్చడం సమంజసమేనా అని అడిగారు. ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా వారి ప్రాజెక్టులకు ఇప్పటికీ కూడా అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకపోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోవాలనే దురుద్దేశాలు తమకు అప్పుడు, ఇప్పుడు లేవని స్పష్టం చేశారు. తెలుగు ప్రాంతాలు, తెలుగు ప్రజలు బాగుండాలి అన్నది తెలుగుదేశం పార్టీ విధానమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు రిమాండ్ పొడిగింపు
చేనేతలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
For More AP News and Telugu News