CM Chandrababu: ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారు.. జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్
ABN , Publish Date - Jul 03 , 2025 | 11:56 AM
దోచుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నీతిమాలిన వాళ్లు, రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని విమర్శించారు. చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయని వాళ్లు తమ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

చిత్తూరు: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (AP CM Nara Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగయ్య భార్యను బెదిరించి రాజకీయం చేస్తారా అని ప్రశ్నించారు. కారు కింద పడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించే ఓపిక కూడా లేదా అని నిలదీశారు. కనీస బాధ్యత, సామాజిక స్పృహా లేకుండా ప్రవర్తిస్తారా అని మండిపడ్డారు. కారు కిందపడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేస్తారా అని ఫైర్ అయ్యారు. ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారని ధ్వజమెత్తారు. కుప్పంలో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటించారు. కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో ఇవాళ(గురువారం) ఏపీలోనే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్‌ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
నీతిమాలిన వాళ్లు, రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయని వాళ్లు తమ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దోచుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలను మీరు ఆదుకోకపోగా.. పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు పనులు తాత్కాలికం.. చేసిన పనులే శాశ్వతమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తానేప్పుడూ తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేయలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
బనకచర్ల ప్రాజెక్ట్‌పై సీఎం క్లారిటీ...
బనకచర్ల ప్రాజెక్ట్‌తో (Banakacharla Project) ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లని తానేప్పుడూ వ్యతిరేకించలేదని క్లారిటీ ఇచ్చారు. నీటి సమస్య పరిష్కారమైతే తెలుగువారు బాగుపడతారని ఉద్ఘాటించారు. రైతులను అన్నివిధాలా ఆదుకునే ప్రభుత్వం తమదని వెల్లడించారు. తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని చెప్పుకొచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చామని స్పష్టం చేశారు. అనర్హులకు పెన్షన్ తీసేస్తే వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు.
మామిడి రైతుల కష్టాలపై సమీక్ష..
అలాగే.. మామిడి రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. దిగుబడి పెరిగినందుకే మామిడి ధర తగ్గిందని తెలిపారు. రైతులను ఆదుకుంటాం, కేంద్ర ప్రభుత్వ సాయం కూడా తీసుకుంటామని అన్నారు. మామిడి రైతులకు తాము చేసినంత సాయం గతంలో ఎవరైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. శవ రాజకీయాలు చేసే వారు మామిడి రైతులపై ప్రేమ కురిపిస్తున్నారని అన్నారు. రైతుల ఇబ్బందులను తాము పరిష్కరిస్తామని.. రైతులకూ తమపై నమ్మకం ఉందని ఉద్ఘాటించారు. మామిడి రైతుల గురించి.. వ్యవసాయం, హార్టీకల్చర్ గురించి ఏ మాత్రం పట్టించుకోని వారు ఇప్పుడు మాట్లాడతారా, మైక్రో సబ్సిడీలిచ్చారా అని ప్రశ్నించారు. హంద్రీనీవా పనులను తామే చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోనే రూ.3980 కోట్లు ఖర్చు పెడుతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయంలో లాభాలు వస్తాయని తెలిపారు. ఫుట్ ప్రాసెసింగ్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్‌పై చర్చిస్తున్నామని అన్నారు. మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారాయని చెప్పుకొచ్చారు. ఏ పంట వేస్తే లాభదాయకమో కూడా ఆలోచిస్తున్నామని అన్నారు. తమిళనాడులో లేని ఫుడ్ ప్రాసెసింగ్ ఏపీలో ఉందని ఉద్ఘాటించారు. సుపరిపాలనలో తొలిఅడుగులో భాగంగా ఇంటింటికీ వెళ్తున్నామని వెల్లడించారు సీఎం చంద్రబాబు.
వైద్య రికార్డులు డిజిటలైజ్ చేస్తాం..
ఏపీలోనే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్‌ని కుప్పంలో ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. టాటా సంస్థ సహకారంలో వ్యక్తిగత వైద్య రికార్డులను డిజిటలైజ్ చేసేలా డీజీ నెర్వ్ సెంటర్ కార్యకలాపాలు చేపడుతున్నామని తెలిపారు. కుప్పంలోని 13 ప్రాథమిక వైద్యా ఆరోగ్య కేంద్రాల్లో డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఏరియా ఆస్పత్రి పీహెచ్సీలు - 13, విలేజ్ హెల్త్ సెంటర్లు- 92లని అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. వ్యక్తిగత వైద్య రికార్డుల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉండేలా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు ప్రారంభించామని పేర్కొన్నారు.
సకాలంలో రోగనిర్ధారణ, వైద్య నిపుణుల అపాయింట్‌మెంట్, వ్యక్తిగత కౌన్సెలింగ్ తదితర సేవలను డిజిటల్ నెర్వ్ సెంటర్ అందించనుందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. వర్చువల్ విధానంలోనూ రోగికి వైద్య నిపుణులను అందుబాటులోకి తీసుకువచ్చి చికిత్స అందించే వెసులుబాటును తీసుకువస్తామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం సేవలు, ప్రైవేటు ఆస్పత్రులతో అనుసంధానం కూడా నెర్వ్ సెంటర్ ద్వారా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు.
రోగనిర్ధారణ, ఆరోగ్య సేవలు, స్క్రీనింగ్ టెస్టులు, తదుపరి ఫాలో అప్ ఉండేలా డీజీ నెర్వ్ సెంటర్ సేవలు ఉంటాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రజా ఆరోగ్యానికి సంబంధించి అన్ని వివరాలను ఒక్క చోట చేర్చేలా డిజినెర్వ్ సెంటర్ పనిచేస్తుందని వివరించారు. మొదటి దశలో కుప్పం, రెండో దశలో చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు డిజిటల్ నెర్వ్ సెంటర్ విస్తరిస్తున్నామని చెప్పుకొచ్చారు. మూడో దశలో ఏపీవ్యాప్తంగా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలను విస్తరించేలా ప్రణాళిక చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఉద్యోగులకు ఉచిత వసతి పొడిగింపు
రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు
For More AP News and Telugu News