CM Chandrababu With Students: మెగా పీటీఎం.. స్టూడెంట్స్‌కు పాఠం చెప్పిన సీఎం
ABN , Publish Date - Jul 10 , 2025 | 11:13 AM
CM Chandrababu With Students: విద్యార్థులు చిత్రించిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తిలకించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోగోతో రూపొందించిన ఫొటో ఫ్రేమ్‌లో వారిద్దరూ ఫొటోలు దిగారు.

పుట్టపర్తి, జులై 10: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించింది ఏపీ సర్కార్. వరుసగా రెండో ఏడాదీ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా పేరెంట్ టీచర్ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), విద్యాశాఖ మంత్రి లోకేశ్ (Minister Nara Lokesh) పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు.
విద్యార్థులు చిత్రించిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను సీఎం, మంత్రి తిలకించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోగోతో రూపొందించిన ఫొటో ఫ్రేమ్‌లో చంద్రబాబు, లోకేశ్ ఫొటోలు దిగారు. పాఠశాలకు వచ్చిన సీఎంకు ఎన్సీసీ క్యాడెట్‌లు గౌరవ వందనం సమర్పించి స్కూల్లోకి తీసుకుని వచ్చారు. జెడ్పీ పాఠశాల క్యాంపస్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ మాటామంతి నిర్వహించారు. విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడంతో పాటు.. మార్కులు పెంచుకుని ఉన్నతస్థాయికి వెళ్లాలని సీఎం ఆకాంక్షించారు. హాజరు, మార్కుల వివరాలను తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
టీచర్‌గా సీఎం..
మెగా పీటీఎం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయుడిగా మారారు. జెడ్పీ హైస్కూల్‌లో సహజ వనరులు, పునరుత్పాదక వనరుల వినియోగం, సంరక్షణ గురించి విద్యార్థులకు సీఎం బోధించారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలంటే వనరుల సద్వినియోగం అవసరమని విద్యార్ధులకు వివరించారు. విద్యార్ధులు చదువుకునే పాఠ్యపుస్తకాలు కూడా ఇతరులు మరోమారు వినియోగించుకునేలా జాగ్రత్తగా వాడాలని సూచించారు. విద్యుత్, నీరు లాంటి వనరుల సద్వినియోగం కూడా సామాజిక బాధ్యత అంటూ స్టూడెంట్స్‌కు చెప్పారు చంద్రబాబు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల వైపు విద్యార్ధులు దృష్టి పెట్టాలన్నారు. అందరూ ఉద్యోగాలే కాదు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులుగానూ మారాలన్నారు. నారా లోకేశ్ బాగా చదువుకుని ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి అయ్యారని వెల్లడించారు. ప్రజలకు మంచి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్.. విద్యార్థులతోపాటు బల్లపై కూర్చుని సీఎం చెప్పే పాఠాన్ని ఆసక్తిగా విన్నారు.
ఇవి కూడా చదవండి
ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడి.. వైసీపీ శ్రేణులపై కేసులు
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. 29మంది సెలెబ్రిటీలపై ఈడీ కేసు
Read Latest AP News And Telugu News