Jagan Bangarupalyam Tour Controversy: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడి.. వైసీపీ శ్రేణులపై కేసులు
ABN , Publish Date - Jul 10 , 2025 | 10:05 AM
Bangarupalem Tour Controversy: నిబంధనలు ఉల్లంఘించి రోడ్ షో నిర్వహించినందుకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్, బంగారుపాళ్యం మండల వైసీపీ పార్టీ కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి , మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ కుమార్ రాజా సహా మరికొందరిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు.

చిత్తూరు, జులై 10: మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించారు. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. మాజీ సీఎం పర్యటనలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌పై (Andhra Jyothy Photographer Attacked) దాడి చేసిన వైసీపీ శ్రేణులపై బంగారుపాళ్యం పోలీసులు కేసు నమోదు చేశారు. బైరెడ్డిపల్లి మండలం పెద్ద చల్లారికుంట గ్రామానికి చెందిన ప్రకాశ్ ఆచార్య అనే యువకునితోపాటు మరికొంత మంది కలిసి శివ కుమార్‌పై దాడికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే ట్రాక్టర్ల ద్వారా తీసుకువచ్చిన మామిడిని రోడ్డుపైన పోసిన ఘటనలోనూ పలువురుపై కేసు నమోదు అయ్యింది. ఈ ఘటనలో తుంబపాలెం గ్రామానికి చెందిన అక్బర్, ఉదయ్ కుమార్ సహా మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించి రోడ్ షో నిర్వహించినందుకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్, బంగారుపాళ్యం మండల వైసీపీ పార్టీ కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి , మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ కుమార్ రాజా సహా మరికొందరిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్త పర్యవేక్షణలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి వ్యక్తులను గుర్తించే పనిలో కాప్స్ నిమగ్నమయ్యారు. సీసీ ఫుటేజీలు, డ్రోన్ కెమెరాల వీడియోలను పోలీసు యంత్రాంగం పరిశీలిస్తోంది. జగన్ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ఈరోజు (గురువారం) మరికొన్ని కేసులు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎవ్వరినీ వదలం: మంత్రి లోకేశ్
ఇదిలా ఉండగా.. జగన్ పర్యటనలో చిత్తూరు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌పై బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డ్‌లో వైసీపీ మూకలు చేసిన దాడిని మంత్రి నారా లోకేశ్ (Minister Nara lokesh) తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. శివకుమార్‌పై దాడికి కారకులైన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు వైసీపీ ఇంఛార్జ్ విజయానంద రెడ్డి పాత్ర ఏ మేరకు ఉందో చూడాలంటూ మంత్రి ట్విట్టర్లో పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. దాడికి పాల్పడ్డ వారిని ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
లోకేశ్ ట్వీట్..
‘మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడే. శివకుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేసి రాక్షసానందం పొందారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు వైసీపీ ఇంఛార్జ్ విజయానందరెడ్డి ప్రోద్బలంతోనే వైసీపీ రౌడీలు ఈ హేయమైన చర్యకు పాల్పడ్డారు. పరామర్శల పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారు. రప్పా రప్పా అంటూ వార్నింగ్‌లు ఇవ్వడం వైసీపీ తీరుకు నిదర్శనం. శివకుమార్‌పై దాడికి పాల్పడిన వారికి చట్టపరిధిలో శిక్ష తప్పదు’ అంటూ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
నారాయణస్వామి రియాక్షన్
కాగా.. లోకేశ్ ట్విట్టర్ పోస్ట్‌పై మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. లోకేశ్ రెడ్ బుక్‌లో తనను, విజయానంద రెడ్డిని ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియోలో తెలిపారు. శివ కుమార్‌పై దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని, అక్కడ తాను ఉన్నది వాస్తవమేనని కానీ దాడికి ప్రేరేపించలేదని వెల్లడించారు. ఏదో సాకు పెట్టి రెడ్ బుక్‌లో తమ పేర్లు ఇరికించాలని మంత్రి చూస్తున్నారని, ఇలాంటి ట్వీట్లు పెట్టడం ద్వారా మానసికంగా తమను వేదనకు గురి చేయడం మానుకోవాలంటూ సెల్ఫీ వీడియోలో నారాయణస్వామి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. 29మంది సెలెబ్రిటీలపై ఈడీ కేసు
ఉత్తర భారతదేశంలో పలు చోట్ల భూప్రకంపనలు
Read Latest AP News And Telugu News