Four New Airports: ఆ నాలుగు విమానాశ్రయాలకు హడ్కో రుణం
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:55 AM
శ్రీకాకుళం, దగదర్తి, అమరావతి, కుప్పం విమానాశ్రయాల నిర్మాణానికి రూ.1,000 కోట్లు కావాలని హడ్కోను రాష్ట్ర విమానాశ్రయాభివృద్ధి సంస్థ కోరింది.

ఒంగోలు, సాగర్‌లలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం, దగదర్తి, అమరావతి, కుప్పం విమానాశ్రయాల నిర్మాణానికి రూ.1,000 కోట్లు కావాలని హడ్కోను రాష్ట్ర విమానాశ్రయాభివృద్ధి సంస్థ కోరింది. ప్రాథమిక సమాలోచనల అనంతరం ఆ మొత్తాన్ని రుణంగా అందించేందుకు హడ్కో సూత్రప్రాయంగా ఆమోదించింది. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు బుధవారం మంత్రిమండలి సమావేశం ఆమోదం తెలిపింది. దీంతో ఈ నాలుగు విమానాశ్రయాల నిర్మాణాలకు విమానాశ్రయాభివృద్ధి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా.. ఒంగోలు, నాగార్జునసాగర్‌లలోనూ కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌ఫోర్టులు నిర్మించాలని సంస్థ భావించింది. అందుకోసం టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టు (టీఈఎ్‌ఫఆర్) నివేదికను తయారు చేసేందుకు ఆసక్తి గల సంస్థల కోసం మంగళవారం ప్రకటన జారీ చేసింది. 29లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. కాగా, రాష్ట్రంలో విమాన తయారీ సంస్థను ఏర్పాటు చేస్తామంటూ సరళ ఏవియేషన్ మంత్రి బీసీ జనార్దనరెడ్డికి ప్రతిపాదనలు అందజేసింది. ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం వెలగపూడి సచివాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. పైలట్ శిక్షణలో ప్రతిష్ఠాత్మక సంస్థ గోల్డెన్ ఎప్యూలెట్స్ ఏవియేషన్ అకాడమీ ప్రతినిధులు కూడా సచివాలయంలో మంత్రి జనార్దనరెడ్డిని కలిశారు.రాష్ట్రంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు.