Pawan Kalyan: దేవాడలో ఏం జరుగుతోంది
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:48 AM
నిబంధనలకు విరుద్ధంగా విజయనగరం జిల్లా, గరివిడి మండలం దేవాడ మైనింగ్ బ్లాక్‌లో మాంగనీసు తవ్వకాలు సాగిస్తుండటంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు

మైనింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్ ఆరా
సమగ్ర నివేదిక ఇవ్వాలని విజయనగరం అధికారులకు ఆదేశం
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా విజయనగరం జిల్లా, గరివిడి మండలం దేవాడ మైనింగ్ బ్లాక్‌లో మాంగనీసు తవ్వకాలు సాగిస్తుండటంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. అక్కడ అనుమతించిన దానికంటే ఎక్కువగా తవ్వకాలు సాగిస్తున్నారని డిప్యూటీ సీఎం కార్యాలయానికి పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదులను పరిశీలించిన ఆయన.. అక్కడ జరుగుతున్న తవ్వకాలపై సమగ్ర నివేదిక అందించాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. ఫిర్యాదులపై విజయనగరం జిల్లా యంత్రాంగంతో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు చర్చించారు. ఆయన కోరిన వివరాలతో సమగ్ర నివేదిక అందించాలని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనే గనులను వేలం వేశారని, ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అభ్యంతరాలను ఆనాడు పరిగణనలోకి తీసుకోలేదని ఫిర్యాదుదారులు తెలిపారు.
జనసేనలోకి వైసీపీ జెడ్పీటీసీలు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి చెంది న నలుగురు జెడ్పీటీసీ సభ్యులు జనసేన పార్టీలో చేరారు. చింతలపూడి జెడ్పీటీసీ పొల్నాటి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, అత్తిలి జెడ్పీటీసీ అడ్డాల జానకి, పెరవలి జెడ్పీటీసీ కొమ్మిశెట్టి రజనీ.. పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు పెనుగొండ సబ్బారాయుడు, వైశ్యసత్ర సముదాయాల అధ్యక్షుడు దేవకీ వెంకటేశ్వర్లుతో పాటు మరికొంత మంది జనసేన కండువా కప్పుకొన్నారు.
పవన్‌తో మాధవ్ భేటీ..
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మాధవ్‌కు ఈ సందర్భంగా పవన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాధవ్‌కు శాలువా కప్పి సత్కరించారు. ఈ భేటీలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు.