Share News

CM Chandrababu Fires on Jagan: నేను అభివృద్ధి చేస్తుంటే.. వాళ్లు విధ్వంసం చేస్తున్నారు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 01 , 2025 | 05:29 PM

వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ పార్టీకి ఏమీ దొరకటం లేదని.. వారి జీవితమే ఫేక్ అని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు.

CM Chandrababu Fires on Jagan: నేను అభివృద్ధి చేస్తుంటే.. వాళ్లు విధ్వంసం చేస్తున్నారు: సీఎం చంద్రబాబు
CM Chandrababu Fires on Jagan

సత్యసాయి జిల్లా, పెద్దన్నవారి పల్లి, నవంబరు1 (ఆంధ్రజ్యోతి): వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ పార్టీకి ఏమీ దొరకటం లేదని.. వారి జీవితమే ఫేక్ అని ఎద్దేవా చేశారు. ఇవాళ(శనివారం) సత్యసాయి జిల్లాలోని పెద్దన్నవారి పల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పేదలసేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని గొడ్డలితో చంపి తనపై నెట్టేశారని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు.


సాక్షిలో గుండెపోటు అని వస్తే తానూ నమ్మేశానని.. తానేప్పుడూ రాగద్వేషాలతో పనిచేయనని స్పష్టం చేశారు. ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ని దగ్గర పెట్టుకుని రక్తం పడిన గదిని కడిగేశారని... ఆధారాలు చెరిపేశారని విమర్శించారు. వివేకా కుమార్తె ఫిర్యాదు చేసిన తర్వాత అప్పుడు గొడ్డలి పోటని ప్లేటు ఫిరాయించారని మండిపడ్డారు. వివేకా హత్య ఘటనలో ఏమరుపాటుకు గురయ్యామని చెప్పుకొచ్చారు. కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామాలు ఆడారని విమర్శించారు. అలాంటి వాళ్లకు రాజకీయాలు చేసేందుకు అర్హత ఉందా..? అసలు వారికి పార్టీగా ఉండే అర్హత ఉందా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని అనుకుంటే ఎంతటి వారినైనా ఢీ కొంటానని స్పష్టం చేశారు. రాయలసీమ ఫ్యాక్షన్‌ను, హైదరాబాద్‌లో మత విద్వేషాలు, నక్సల్స్ సమస్యనూ అణచివేశానని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు.


అందుకే నక్సల్స్ అలిపిరిలో తనపై క్లైమోర్‌మైన్స్ పేల్చారని చెప్పుకొచ్చారు. నేరస్తులే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అండతో నేరాలు చేస్తూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కర్నూలులో బస్సు దగ్ధం ఘటన జరిగితే అందులోనూ ఫేక్ ప్రచారాలకు తెరదీశారని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదే‌శ్‌కు చెందిన వ్యక్తి ఒడిశాలో బస్సు రిజిస్ట్రేషన్ చేసి హైదరాబాద్ నుంచి బెంగుళూరు మధ్య నడుపుతున్నారని తెలిపారు. ఏపీలో ప్రమాదం జరిగితే దానిపై కూడా ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఫేక్ వ్యక్తులు దుష్పచారం చేస్తుంటే ప్రతీ రోజూ చెప్పుకోవాలా..? అని ఆగ్రహించారు. వైసీపీకి ఓ పాంప్లెట్ ఉందని... ఓ ఛానల్ కూడా ఉందని... కానీ ఆ వ్యక్తులు బయటకు వచ్చి తమకు ఛానల్ లేదని, పేపర్ లేదని ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు.


వాహనాల రిజిస్ట్రేషన్ల అంశంపైనా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఓ లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. పేపర్, ఛానల్ ద్వారా శవరాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మరో ఘటనలో కమ్మ, కాపు మధ్య కుల విద్వేషాలు రగిల్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వాళ్లు నిద్రలేస్తే చాలు దుష్ప్రచారానికి తెగబడుతూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి రోజూ తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. ఇక ఏమాత్రం ఉపేక్షించబోనని... అడుగడుగునా సీసీ కెమెరాలు, ఆధారాలు ఉన్నాయని... అన్నిటినీ బయటపెడతామని హెచ్చరించారు. అమాయకులను మోసం చేస్తూ కులం, మతం, ప్రాంతం పేరుతో జగన్ అండ్ కో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 01 , 2025 | 06:51 PM