అమెరికాతో ఒప్పందాల వల్ల మన రైతులకు నష్టం: హరీశ్‌రావు
ABN , Publish Date - Feb 21 , 2026 | 05:09 PM
కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఇటీవల చేసుకున్న ఒప్పందాల వల్ల తెలంగాణ రైతులతో పాటూ దేశంలోని రైతులంతా తీవ్ర నష్టానికి గురయ్యే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు..
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఇటీవల చేసుకున్న ఒప్పందాల వల్ల తెలంగాణ రైతులతో పాటూ దేశంలోని రైతులు తీవ్ర నష్టానికి గురయ్యే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) వ్యాఖ్యానించారు. అమెరికాలో సాగవుతున్న జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి వంటి పంటలను భారతదేశంలోకి ఎలాంటి టాక్స్ లేకుండా అనుమతించడం వల్ల మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న రైతులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ప్రమాదంలో పడతారని తెలిపారు. మన దేశంలో కూడా అన్నదాతలు మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, పత్తి పంటలని ఎక్కువగా పండిస్తూ జీవనం సాగిస్తున్నారని వివరించారు. అమెరికా దేశం నుంచి ఈ పంటలను దిగుమతి చేసుకోవడం వల్ల తెలంగాణలో ఉన్న రైతులంతా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో రైతులకు సంబంధించిన ఓ కార్యక్రమానికి హరీశ్‌రావు ఇవాళ (శనివారం) హాజరయ్యారు. వివిధ స్టాల్స్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయం చేస్తే మంచి లాభాలు పొందే అవకాశం ఉందని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న యాంత్రిక పరికరాలను ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు.
రైతు భరోసా రావడం లేదు..
గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా రావడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. కేవలం 12 గంటల పాటే విద్యుత్ సరఫరా ఇస్తున్నారని, ఎరువులు సకాలంలో అందడం లేదని చెప్పుకొచ్చారు. అన్నదాతల సమస్యలను త్వరలో జరిగే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేసే రైతులకు వ్యవసాయ పనిముట్లు, డ్రోన్లు, ట్రాక్టర్లు సబ్సిడీకి ఇచ్చే విధంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు.. అన్వేశ్‌ను ఉపేక్షించం.. కరాటే కల్యాణి స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And Telugu News