Sigachi Accident Report: ఈ నెల 28న కేబినెట్ భేటీ.. సిగాచీ ప్రమాద నివేదికపై చర్చ..
ABN , Publish Date - Jul 26 , 2025 | 09:56 AM
పాశమైలారం సిగాచీ దుర్ఘటన నివేదికపై ఈ నెల 28న ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. సిగాచీ ప్రమాదంపై నిపుణుల కమిటీ సూచించిన నిర్ణయాలపై చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

హైదరాబాద్: సోమవారం తెలంగాణ కేబినెట్ మరోసారి భేటీ కానుంది. పాశమైలారం సిగాచీ ప్రమాదంపై నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టుపై ప్రభుత్వం ఈ సమావేశంలో కీలక చర్చలు జరపనుంది. కమిటీ సూచనలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, సిగాచీ దుర్ఘటనపై రెండు రోజుల క్రితమే సీఎస్‌కు నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. సిగాచీ కంపెనీ సరైన రక్షణా చర్యలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేసింది. ఈ నివేదికలో పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై పలు కీలక సూచనలు చేసింది.
అగ్ని ప్రమాదాల విషయంలో సిగాచీ కంపెనీ ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించలేదని నిపుణుల కమిటీ నివేదికలో వెల్లడించింది. పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించకుండా ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేసింది. పరిశ్రమల్లో విపత్తు నివారణకు రాష్ట్రవ్యాప్తంగా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం అత్యవసరమని సూచించింది. ఈ అథారిటీ పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షించాలని పేర్కొంది.
అలాగే ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని.. వాటిని విపత్తు నిర్వహణ సంస్థలతో సమన్వయం చేయాలని సూచించింది. ప్రమాద సమయాల్లో ఎలా వ్యవహరించాలో సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక భద్రతా వ్యవస్థలు పరిశ్రమల్లో ఏర్పాటు చేయాలని.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే కార్మికుల వివరాలు సేకరించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కమిటీ నివేదికలో పేర్కొంది.
జూన్ 30న పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 46 మంది కార్మికులు మరణించగా.. 8 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గాయపడినవారిలో 29 మంది ఆస్పత్రుల్లో కోలుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునారావృతం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నెల 2న ఐఐసిటి సైంటిస్టులతో కమిటీ వేసింది. నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సిగాచీ కంపెనీపై తీసుకోవాల్సిన చర్యలు, పరిశ్రమలు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలపై కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకుంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొట్టిన వాన.. రహదారులు జలమయం
ఇందిరమ్మ క్యాంటీన్లలో ఆగస్టు 15 నుంచి అల్పాహారం
Read Latest Telangana News and National News