Share News

Trump On Hamas: హమాస్‌పై మండిపడ్డ ట్రంప్.. వారి పని ముగించేయాలంటూ ఇజ్రాయెల్‌కు సూచన

ABN , Publish Date - Jul 26 , 2025 | 08:16 AM

హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించట్లేదంటూ ట్రంప్ మండిపడ్డారు. హింసను ఎంచుకున్నట్టు ఉందని వ్యాఖ్యానించారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసి పని ముగించాలని అభిప్రాయపడ్డారు.

Trump On Hamas: హమాస్‌పై మండిపడ్డ ట్రంప్.. వారి పని ముగించేయాలంటూ ఇజ్రాయెల్‌కు సూచన
Trump Hamas statement

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌పై మరోసారి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. హమాస్‌ కథ ముగించాలని ఇజ్రాయెల్‌కు సూచించారు. గాజాపై మరిన్ని దాడులు చేయాలని తేల్చి చెప్పారు. శాంతిస్థాపనకు హమాస్ ఎలాంటి ఆసక్తి చూపట్లేదని అన్నారు.

‘హమాస్‌కు ఎటువంటి డీల్ చేసుకునేందుకు ఇష్టం లేదు. వాళ్లు చావాలని కోరుకుంటున్నట్టు ఉన్నారు. ఇది చాలా దారుణం. ఇక మొదలెట్టిన పనిని ముగించడం మినహా మరో మార్గం లేదు’ అని ట్రంప్ అన్నారు. హమాస్ చెరలో బందీగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుడు ఈడన్ అలెగ్జాండర్‌ను విడిపించడంలో డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారు. అయితే, హమాస్ వద్ద ప్రస్తుతం బందీల సంఖ్య తక్కువేనని అన్నారు. చర్చలు చరమాంకంలోకి వచ్చిన ఈ దశలో కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించడం లేదని అన్నారు. యుద్ధాన్ని కొనసాగించాలని వారు కోరుకుంటున్నట్టు ఉందని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తను మొదలెట్టిన పనిని పూర్తి చేయాలని అన్నారు.


మధ్యప్రాచ్యంలో శాంతి చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్‌ హమాస్‌తో చర్చల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయంలో తమ వ్యూహాల్ని సమీక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. చర్చల్లో ప్రతిష్టంభనకు హమాస్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు. ఇక హమాస్ చెరలో బందీలను విడిపించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ తెలిపారు.

మరోవైపు, గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఆహారం, ఔషధాల నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. గాజాను ఇజ్రాయెల్ అన్ని వైపుల నుంచి దాదాపుగా దిగ్బంధనం చేసింది. దీంతో, గాజా వాసులకు మానవతా సాయం అందడం కూడా కష్టంగా మారింది. క్షామం తరహా పరిస్థితులు కమ్ముకుంటున్నాయి. అయితే, తాము మానవతా సాయానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించట్లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. ఐక్యరాజ్య సమితి నిర్వహణ లోపాలే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి:

పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తాము.. ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటన

మారుతున్న జర్మనీ యుద్ధ తంత్రం.. రోబో బొద్దింకలు, ఏఐ రోబోల అభివృద్ధిపై దృష్టి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 26 , 2025 | 08:51 AM