Share News

TG News: నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో గందరగోళం

ABN , Publish Date - Apr 21 , 2025 | 01:28 PM

Rythu Mahotsava Sabha: నిజామాబాద్‌లో సోమవారం నాడు రైతు మహోత్సవ సభ జరిగింది. ఈ సభకు హెలికాప్టర్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ వచ్చారు. ఈ సమయంలో హెలికాప్టర్‌ నుంచి వచ్చిన గాలితో సభ స్వాగత తోరణాలు కూలడంతో కొంతసేపు హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

TG News: నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో గందరగోళం
Nizamabad Rythu Mahotsava Sabha

నిజామాబాద్: నిజామాబాద్‌లో ఇవాళ(సోమవారం) రైతు మహోత్సవ సభ జరిగింది. అయితే సభ ప్రాంగణం పక్కనే హెలికాప్టర్ ల్యాండింగ్ కావడంతో టెంట్లు కూలాయి. గాలి దుమారంతో స్వాగత తోరణం కూలింది. హెలికాప్టర్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ ఉన్నారు. హెలికాప్టర్ గాలికి సభా ప్రాంగణం నుంచి రైతులు పరుగులు పెట్టారు. సభలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. గాలి, దుమ్ము ఒకేసారి రావడంతో సభలో కొంతసేపు అలజడి నెలకొంది.


పసుపు బోర్డు కోసం పోరాటం చేశా: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam-Kumar-Reddy.jpg

పసుపు బోర్డు కోసం తాను పోరాటం చేశానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బోర్డు ఏర్పాటు చేశారు కానీ ఇంకా పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. గత పదేళ్లలో ప్రాణహిత చేవెళ్లను పట్టించుకోలేదని విమర్శించారు. 22వ ప్యాకేజికి వెంటనే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని సూచించారు. కాళేశ్వరంతో కొత్తగా ఆయకట్టు పెరగలేదని అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టును ఆధునీకరిస్తామని స్పష్టం చేశారు. పూడికతీత పనులకు వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.


రైతులకు నష్టపరిహారం ఇస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Thummala.jpg

జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. పసుపు బోర్డు రైతులకు ఉపయుక్తంగా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఆర్థికపరంగా ప్రభుత్వానికి కష్టాలు ఉన్నా రూ. 33 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. త్వరలోనే రైతు భరోసా ఇస్తామని అన్నారు. వడగండ్ల వానల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం త్వరలోనే అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాటిచ్చారు.


రైతు మహోత్సవవాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా సాగు చేయాలని అన్నారు. ఆయిల్ ఫాం పంట వేయండి.. ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు. 24 గంటల్లో పంట కొని.. వెంటనే డబ్బులు రైతుల ఖాతాల్లో వేయిస్తామని చెప్పారు. అన్నదాతలు ఆదాయం ఉన్న పంటలను పండించాలని సూచించారు. ప్రకృతి, క్రిమికీటకాలు, వ్యాపార వర్గాలు రైతుల మీద దాడి చేస్తున్నా వారిని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి జిల్లాలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు కోసం కృషి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


మాది రైతు ప్రభుత్వం: మహేష్ కుమార్ గౌడ్

TPCC-Chief-Mahesh-Kumar-Gou.jpg

తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఓటేసినందునే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని...ఇది రైతు ప్రభుత్వమని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రైతులను విదేశాలకు తీసుకెళ్లాలని మంత్రులు, అధికారులకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ లక్షల కోట్ల అప్పులు నెత్తిన పెట్టి పోయినా రేవంత్ సర్కార్ ఆరు గ్యారంటీలతో పాటు సన్నబియ్యం పథకం అమలు చేస్తుందని ఉద్ఘాటించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్త చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మాట నిలబెట్టుకునేలా పాలన అందిస్తామని చెప్పారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో సీల్టు తీసి సాగునీరు పెరిగేలా చూడాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. ఎందుకూ పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు ఖర్చు చేసి వృథా చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదని బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 21 , 2025 | 02:24 PM