Harish Rao: రైతుల సమస్యలు పట్టించుకోరా.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై హరీశ్‌రావు ఫైర్
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:48 AM
మొక్కజొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వేగం పెంచాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. మొక్కజొన్న రైతులను పట్టించుకోవడం లేదని, కొన్నవారికి కూడా డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్రేడ్‌ల పేరిట పత్తి రైతులను అరిగోస పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఇవాళ(ఆదివారం) చిన్న కోడూరు మండలం మల్లారంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 85లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పిందని.. అయితే, 6లక్షల మెట్రిక్ టన్నులని మాత్రమే కొనుగోలు చేసిందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీశ్‌రావు.
కోనుగోలు చేసిన ధాన్యానికి రూ. 1400 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు డబ్బులు వేస్తామని చెప్పి ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. మాటల్లో మాత్రం 24 గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పారని.. చేతల్లో మాత్రం రోజుల తరబడి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని నిలదీశారు. గత యాసంగి పంట బోనస్ డబ్బులు రూ.1200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, అవి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8డిగ్రీల చలి ఉండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు మాజీ మంత్రి హరీశ్‌రావు.
రైతులకు త్వరితగతిన డబ్బులు వేయాలని సూచించారు. మొక్కజొన్న కొనుగోళ్లలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వేగం పెంచాలని కోరారు. మొక్కజొన్న రైతులను పట్టించుకోవడం లేదని, కొన్నవారికి కూడా డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్రేడ్‌ల పేరిట పత్తి రైతులను అరిగోస పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో పత్తి రైతులకు నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చారు. రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నాయని మండిపడ్డారు. నేటికి కూడా పంట బీమా ఎందుకు చేయించలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్.. సీవీ ఆనంద్ ఏమన్నారంటే..
షాకింగ్ .. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లు బంద్..
Read Latest Telangana News and National News