TG GOVT: హుస్నాబాద్ అభివృద్ధిపై మంత్రుల కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 27 , 2025 | 09:19 PM
హుస్నాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని.. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు.

సిద్దిపేట: హుస్నాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి (Husnabad Development) చేస్తున్నామని.. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు. హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. అక్కన్నపేట నుంచి జనగాం వరకు నాలుగు లైన్‌ల రోడ్డు త్వరలోనే వస్తుందని అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ హుస్నాబాద్ అభివృద్ధికి సహాకారం అందించాలని కోరారు. ఎల్లమ్మ చెరువు అభివృద్ధి, ఇంజనీరింగ్ కాలేజ్, టూరిజ్ ప్రాజెక్ట్‌లు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇవాళ(శుక్రవారం) హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.
హుస్నాబాద్ ప్రజల గౌరవాన్ని పెంచుతా: మంత్రి పొన్నం ప్రభాకర్
‘రెండు సంవత్సరాల కింద ఇదే వేదిక మీద బడిపండగ జరిగింది. అప్పుడు ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలో లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు , కేబినెట్ మంత్రుల సహకారంతో శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ తరగతులు ఈ సంవత్సరం నుంచి ప్రారంభం అవుతున్నాయి. రూ.82.00 కోట్లతో 150 పడకల ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశాం. రూ.77.20 కోట్లతో రాజీవ్ రహదారి కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు రెండు వరుసల రహదారుల నుంచి నాలుగు వరుసల రహదారికి ఫేజ్ 2కు శంకుస్థాపన చేశాం. నూతనంగా రూ.11.50 కోట్లతో నిర్మించిన 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించాం. ఫేజ్ -1 త్వరలోనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాం. గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల పనులు జరుగుతున్నాయి. నన్ను గెలిపించిన హుస్నాబాద్ ప్రజల గౌరవాన్ని పెంచుతా. హుస్నాబాద్‌ని అభివృద్ధి అన్నిరంగాల్లో ముందుంచుతా. ఇక్కడికి వచ్చిన మంత్రులు హుస్నాబాద్ అభివృద్ధికి అభయం ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో పంట పెట్టుబడి సహాయం, ఇందిరమ్మ ఇళ్లు, సన్నవడ్లకు రూ.500 బోనస్ ,రుణమాఫీ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇలా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హుస్నాబాద్‌లో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం ప్రారంభించామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata Reddy) తెలిపారు. 250 పడకల ఆస్పత్రి, కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేశామని అన్నారు. పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ వస్తే గౌరవెల్లి ప్రాజెక్ట్ వస్తుందని హుస్నాబాద్ అభివృద్ధి జరుగుతుందని.. ఆనాడే పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారని గుర్తుచేశారు. రూ.77 కోట్లతో హుస్నాబాద్ నుంచి సుందరగిరి వరకు ఫేజ్-2 కింద రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
కేసీఆర్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూం ఇవ్వలేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
‘సుందరగిరి నుంచి కొత్తపల్లి వరకు రూ.80 కోట్లతో నాలుగు వరుసల రహదారి వారం రోజుల్లో మంజూరు అవుతుంది.. దానికి పది రోజుల్లో పనులు ప్రారంభం అవుతాయి. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుభరోసా కింద పంట పెట్టుబడి సహాయం అందించాం. ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మొదటి తేదీన జీతాలు ఇస్తున్నాం. రూ.21 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశాం. గత కేసీఆర్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూం ఇవ్వలేదు.. ఒక్క ప్రాజెక్ట్ నిర్మించలేదు. గత ప్రభుత్వం పదేళ్లలో గౌరవెల్లి ఎందుకు పూర్తి చేయలేదు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు.. త్వరలోనే పంట పొలాలకు సాగు నీరు అందిస్తాం. మీరు కలలు కన్నా హుస్నాబాద్ అభివృద్ధికి మేము అంత అండగా ఉంటాం. రాష్ట్రాన్ని విడగొట్టి హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క వార్డు మెంబర్ కూడా లేరు. తెలంగాణ కోసం సోనియా గాంధీ ఏపీలో పార్టీని త్యాగం చేశారు. హుస్నాబాద్‌లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేవి చాలా ఉన్నాయి. మేము అంతా అండగా ఉంటాం. వచ్చే ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్‌కి లక్ష ఓట్ల మెజారిటీ రావాలి. దాదాపు 15 కిలోమీటర్లు ర్యాలీ చేసిన మీకు ధన్యవాదాలు. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడం.. ఫారెస్ట్ అనుమతులు అయిపోయాయి... కాలువల పనులు వేగంగా జరుగుతున్నాయి. బండి సంజయ్ ఈరోజు(శుక్రవారం) హుస్నాబాద్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకాలేకపోతున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బండి సంజయ్ సహకరిస్తారని ఆశిస్తున్నాం’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
పెండింగ్ పనులని పూర్తి చేస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హుస్నాబాద్‌ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడానికి అండగా ఉంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) తెలిపారు. తమ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని అన్నారు. రహదారులు, గౌరవెల్లి ప్రాజెక్ట్ లాంటివి ,ఇందిరమ్మ ఇళ్లు, ఎన్నికల కోసం బీఆర్ఎస్ హయాంలో వదిలేసిన ప్రతి పనిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో ప్రాజెక్ట్‌లు ఉన్న జిల్లాకి ఇన్‌చార్జి మంత్రిగా వచ్చానని తెలిపారు. తమ ప్రభుత్వానికి ఇబ్బంది అయిన నిన్నటి వరకు రూ.40 వేల కోట్లు రైతులకు ఇచ్చామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఆయిల్ ఫామ్‌కి దిగుబడి వచ్చేలా చేస్తాం:మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
‘వ్యవసాయం కోసం లక్ష కోట్లు ఖర్చు చేశాం. అధికారం కోల్పోయిన వారు మమ్మల్ని విమర్శిస్తే అర్థం లేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతున్నాం. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తాం. ఎకరాకు లక్ష రూపాయల దిగుబడి వచ్చే పంట ఆయిల్ ఫామ్. కోతులకు, వర్షాలకు నష్టం జరిగే పంట కాదు. తెలంగాణ భూములు ఎడారి భూములు కాదు అన్ని పంటలు పండే పుణ్యభూమి దక్కన్ పీఠభూమి. ఆయిల్ ఫామ్ ఎకరాకు రూ.50 వేలు అంతర పంటలకు డబ్బులు ఇస్తున్నాం. ఆయిల్ ఫామ్‌కి దిగుబడి వచ్చేలా చేస్తాం. హార్టికల్చర్ పంటలు పండించండి.. మా ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది. పొన్నం ప్రభాకర్ అందరిని శాసించే మంత్రి. పొన్నంకు కేంద్ర పెద్దలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. హాస్పిటల్, ఇంజనీరింగ్ కాలేజ్, గౌరవెల్లి ప్రాజెక్ట్‌లు మాత్రమే కాదు. ఇక్కడి ప్రజలు అడిగిన పనులు మూడేళ్లలో పూర్తి చేస్తాం. మంత్రి పొన్నం బడుగు వర్గాలకు ఆదర్శంగా ఉంటారు’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
కూడా చదవండి
గోల్కొండలో ఆషాఢ మాస బోనాల సందడి షురూ
మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరిక
Read Latest Telangana News And Telugu News