Share News

Tribute To Ande Sri: అందెశ్రీ మృతిపై తెలంగాణ మంత్రుల సంతాపం

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:00 PM

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతిపై తెలంగాణ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని మంత్రులు కొనియాడారు.

Tribute To Ande Sri: అందెశ్రీ మృతిపై తెలంగాణ మంత్రుల సంతాపం
Tribute To Ande Sri

హైదరాబాద్, నవంబరు10(ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) ఆకస్మిక మృతిపై తెలంగాణ మంత్రులు (Telangana Ministers) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని వారు కొనియాడారు. ఈ మేరకు మంత్రులు ఓ ప్రకటన విడుదల చేశారు.


అందెశ్రీ మృతి తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ ప్రజాగాయకుడు అందెశ్రీ అకాల మరణంపై తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావంలో ఆయన రచనలు, గానం కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.


అందెశ్రీ మృతికి భట్టి విక్రమార్క సంతాపం

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతిపై తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు మల్లు భట్టి విక్రమార్క ప్రగాఢ సానుభూతి తెలిపారు.


అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతం సృష్టికర్త: మంత్రి తుమ్మల

ప్రముఖ కవి రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం సృష్టికర్త అందెశ్రీ మరణంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


అందెశ్రీ మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతిపై తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తనకు అత్యంత ఆప్తుడని.. ఆయన అకాల మరణం వ్యక్తిగతంగా తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ‘జయ జయహే తెలంగాణ’ అని ముక్కోటి గొంతుకైన అందెశ్రీ స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో వారి కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందని ప్రశంసించారు. ఆయన మరణం‌ యావత్ తెలంగాణ సమాజానికి తీరని లోటని అన్నారు. తీవ్ర విషాదంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.


అందెశ్రీ తెలంగాణ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ ప్రజాగాయకుడు అందెశ్రీ అకాల మరణంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అందెశ్రీ హఠాన్మరణంపై మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజానికి, సాహితీ లోకానికి ఇది ఎప్పటికీ పూడ్చలేని లోటని పేర్కొన్నారు. మలిదశ ఉద్యమ కెరటమై, రాష్ట్ర సాధన ఆకాంక్షను కోట్లాది ప్రజల గుండెల్లో బలంగా నిలిపిన చారిత్రక గీతాన్ని అందించిన మహనీయుడు అందెశ్రీ అని కొనియాడారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పదం, తెలంగాణ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యమని తెలిపారు. ఆయన సాహితీ సంపద, ముఖ్యంగా జయ జయహే తెలంగాణ గీతం ఉన్నంత వరకు అందెశ్రీ మన గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోతారని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


అందెశ్రీ మృతి సాహిత్య ప్రపంచానికి తీరని లోటు: మంత్రి కొండా సురేఖ

ప్రముఖ రచయిత అందెశ్రీ అకాల మృతిపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ ఆకస్మిక మరణం తెలంగాణకు... రాష్ట్ర సాహిత్య ప్రపంచానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. ఆయన రాసిన జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని తెలంగాణ ఉద్యమ భావోద్వేగాన్ని సజీవంగా ఉంచిందని వ్యాఖ్యానించారు. అందెశ్రీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.


తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీది కీలక పాత్ర:మంత్రి వాకిటి శ్రీహరి

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతిపై మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహిత్య లోకానికి తీరని లోటని తెలిపారు. అందెశ్రీ పాటతో తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని నొక్కి చెబుతూ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారని గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ఆయన పాత్ర కీలకమైనదని ఉద్ఘాటించారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మంత్రి వాకిటి శ్రీహరి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు: జితేందర్ రెడ్డి

ప్రముఖ కవి, గాయకుడు అందెశ్రీ మరణంపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జయ జయహే తెలంగాణ ఉద్యమ గీతా రచయిత అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు అని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డిసెంబర్ 6న డాలస్‌‌లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. సభ కోసం భారీ ప్లానింగ్

జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 10 , 2025 | 12:17 PM