Share News

CM Revanth Reddy: మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Nov 19 , 2025 | 01:26 PM

మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు అందజేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విడతల వారీగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తామని తెలిపారు.

CM Revanth Reddy: మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, నవంబరు18(ఆంధ్రజ్యోతి): కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు అందజేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలను అందజేస్తామని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని గుర్తుచేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఇవాళ(బుధవారం) ఇందిరమ్మ చీరల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు చీరలను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు.


ఇందిరమ్మకే సాధ్యం..

బ్యాంకుల జాతీయకరణ, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకువచ్చి పేదలకు భూములు పంచినా, పేదలకు ఇండ్లు కట్టించినా అది ఇందిరమ్మకే సాధ్యమైందని గుర్తుచేశారు. పాకిస్థాన్‌తో భారతదేశానికి యుద్ధం జరిగిన సమయంలో ధీటుగా నిలబడి ఎదుర్కొన్న ధీశాలి ఇందిరమ్మ అని కీర్తించారు. దేశానికి బలమైన నాయకత్వం అందించిన ఘనత ఇందిరాగాంధీదని ప్రశంసించారు. ఇందిరమ్మ స్ఫూర్తితో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. మహిళలకు పెట్రోల్ బంకులు ఇచ్చి ప్రోత్సహించామని వివరించారు. ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలను యజమానులుగా చేశామని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.


ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లు..

‘మా ప్రభుత్వంలో మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక ఉన్నతి కలిగించే కార్యక్రమాలు చేపట్టాం. ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం. రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించాం. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలని భావించాం. అందుకే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఇందిరమ్మ జయంతి రోజున ప్రారంభించిన ఈ కార్యక్రమం డిసెంబర్ 9వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తాం. అలాగే, మార్చి 1వ తేదీ నుంచి 8వ తేదీ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో అందజేస్తాం. ఈ విషయంలో మహిళలు ఆందోళన చెందొద్దు.. ప్రతీ ఆడబిడ్డకు చీరను అందిస్తాం. మొదటి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ చేస్తాం. చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో రెండు విడతలుగా చీరలను పంపిణీ చేస్తున్నాం. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలి. మీరే బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్.. ఎందుకంటే..

సినిమాల‌కు.. ఇక సెల‌వు! నటనకు వీడ్కోలు.. పలికిన న‌టి తులసి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 19 , 2025 | 02:01 PM