TG News: హైదరాబాద్‌లో దారుణం.. యువకుడిపై కత్తితో దాడి
ABN , Publish Date - Jul 12 , 2025 | 09:41 AM
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఓ యువకుడిపై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడికి బలమైన గాయాలయ్యాయి. హైదరాబాద్‌లో చదువుకునేందుకు సోమాలియా నుంచి వచ్చిన యువకుడిపై దుండగులు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్: భాగ్యనగరంలోని ఐటీ కారిడార్‌లో ఓ యువకుడిపై దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడికి బలమైన గాయాలయ్యాయి. హైదరాబాద్‌లో (Hyderabad) చదువుకునేందుకు సోమాలియా (Somalia) నుంచి వచ్చిన అహ్మద్(25)పై దుండగులు కత్తితో దాడి చేశారు. అహ్మద్‌తో పాటు సోమాలియా నుంచి యూనిస్ అబ్ది కరీం హసన్(22) వచ్చారు. మాసబ్ ట్యాంక్‌లో నివాసం ఉంటూ హిమాయత్ నగర్‌లోని ఓ కాలేజీలో అహ్మద్ బీసీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల(జులై) 8వ తేదీన మాసబ్ ట్యాంక్ నుంచి ఐటీ కారిడార్‌కు ఇద్దరు సోమాలియా యువకులు ఓ పని నిమిత్తం బైక్‌పై వెళ్లారు. ఐకియా వద్ద అర్ధరాత్రి 2 గంటల ప్రాంతలో యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో పక్కనే మరో బైక్‌పై వెళ్తున్న గుర్తు తెలియని యువకులతో అహ్మద్, కరీం హసన్ ఘర్షణ పడ్డారు.
మరో ఇద్దరు స్నేహితులను గుర్తుతెలియని ఆ ఇద్దరు యువకులు అక్కడికి పిలిపించారు. ఈ క్రమంలో సోమాలియా యువకులపై గుర్తు తెలియని యువకులు దాడికి పాల్పడ్డారు. గుర్తుతెలియని యువకుల్లో ఓ యువకుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో సోమాలియా విద్యార్థి అహ్మద్ కడుపులో పొడిచి పరారయ్యాడు. అహ్మద్‌కు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం పక్కనే ఉన్న మెడికవర్ హాస్పిటల్‌కి తరలించారు. శస్త్రచికిత్స అనంతరం బాధితుడు అహ్మద్ కోలుకుంటున్నాడు. స్నేహితుడు యూనిస్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దాడికి పాల్పడ్డ ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడ్డ మరో ముగ్గురు యువకుల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. నిందితుల బైక్ నెంబర్లు కనిపించకపోవడంతో ఐటీ కారిడార్‌లోని సీసీ కెమెరాలని పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
భదాద్రి భూముల కబ్జాపై స్పందించవా.. రామచంద్రా?: కేటీఆర్
సేంద్రియ వ్యవసాయమే శ్రీరామరక్ష
Read Latest Telangana News And Telugu News