Sigachi Industrial Accident Investigation: సిగాచి ఘటన.. మరొకరు మృతి.. ప్రమాద స్థలికి హైలెవల్ కమిటీ
ABN , Publish Date - Jul 04 , 2025 | 11:59 AM
Sigachi Industrial Accident Investigation: సిగాచి ప్రమాద ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో సిగాచి ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. సిగాచి పరిశ్రమలో తీవ్రంగా గాయపడి ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ్ రావు అనే వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంగారెడ్డి, జులై 4: పాశమైలారంలోని సిగాచి ప్రమాద ఘటనా స్థలికి (Sigachi Industrial Accident) సీఎస్ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ చేరుకుంది. ప్రమాద స్థలిని హైలెవల్ కమిటీ సభ్యులు (High Level Committee Visits Sigachi) పరిశీలించారు. కమిటీకి చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణ రావు, సభ్యులుగా రెవెన్యూ, ఇండస్ట్రీ చీఫ్ సెక్రటరీలతో పాటు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైర్ డీజీ, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉన్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన తర్వాత బాధిత కుటుంబాలతో కమిటీ మాట్లాడనుంది. సిగాచి యాజమాన్యంతో కూడా మాట్లాడి వివరాలను సేకరించనుంది. ఇక నిన్న ప్రమాద స్థలిని నిపుణుల కమిటీ పరిశీలించిన విషయం తెలిసిందే. సుమారు మూడు నాలుగు గంటల పాటు నిపుణుల కమిటీ విచారించింది. టెక్నికల్ అంశాలపై నిపుణుల కమిటీ నెలరోజుల్లో ప్రభుత్వానికి (Telangana Govt) నివేదిక ఇవ్వనుంది.
39కి మృతుల సంఖ్య
మరోవైపు ఈ ప్రమాద ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో సిగాచి ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. సిగాచి పరిశ్రమలో తీవ్రంగా గాయపడి ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ్ రావు అనే వ్యక్తి ఈరోజు (శుక్రవారం) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భీరామ్ స్వస్థలం మహారాష్ట్ర. పోస్టుమార్టం అనంతరం భీమ్ రావు మృతదేహాన్ని స్వస్థలానికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాద స్థలిలో ఐదవ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదం నుంచి 61 మంది సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ఈ దుర్ఘటనలో 38 మంది మృతి చెందారని.. అందులో ఇప్పటి వరకు 31 మృతదేహాలను గుర్తించామని వెల్లడించారు. ఇంకా 7 మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. ఆస్పత్రి నుంచి ఇప్పటి వరకు 12 మంది డిశ్చార్జ్ అయ్యారని.. ప్రస్తుతం ఆస్పత్రులలో 23 మంది చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. అలాగే ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రకటించారు. వీరి కోసం ఘటనా స్థలిలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
సిగాచి పరిశ్రమ వద్ద బాధితుల ఆందోళన కొనసాగుతోంది. ఐదు రోజులు గడిచినప్పటికీ తమ వారి ఆచూకీ తెలియడం లేదంటూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో పాటు ఏపీ రాష్ట్రంలోని శ్రీకాకుళంకు చెందిన ఓ కుటుంబం కూడా నిరీక్షిస్తోంది.
ఇవి కూడా చదవండి
తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం స్టార్ట్.. ప్రధానంగా వాటిపైనే చర్చ
మెడికల్ స్కాం.. వైసీపీ కీలక నేత దందాలు వెలుగులోకి..
Read latest Telangana News And Telugu News