Fire Accident: కాటేదాన్ రబ్బర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Jul 04 , 2025 | 05:56 AM
రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని నేతాజీ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున తిరుపతి రబ్బర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

రాజేంద్రనగర్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని నేతాజీ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున తిరుపతి రబ్బర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో రబ్బరు సామగ్రి ఎక్కువగా నిలువ ఉండటంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనలతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. నాలుగు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాద సమయంలో పరిశ్రమలో కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, డీఆర్‌ఎఫ్ బృందాలతో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పరిశ్రమలో కార్లలో ఉపయోగించే రబ్బర్ మ్యాట్లు తయారవుతాయని, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.