Banakacharla Project Controversy: బనకచర్లపై చర్చ అనవసరం.. తేల్చేసిన తెలంగాణ సర్కార్
ABN , Publish Date - Jul 15 , 2025 | 10:55 AM
Banakacharla Project Controversy: బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవంటూ పూర్తి వివరాలను తెలంగాణ ప్రభుత్వం లేఖలో ప్రస్తావించింది. అందుకే చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది రేవంత్ సర్కార్.

హైదరాబాద్, జులై 15: బనకచర్లపై (Banakacharla Project) చర్చించాలన్న ఏపీ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తిరస్కరించింది. బనకచర్లపై చర్చకు నో చెప్పింది. ఈ మేరకు ఏపీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి సమక్షంలో రేపు (బుధవారం) తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశం ఉంది. ఈ క్రమంలో బనకచర్లపై చర్చించాలని సింగిల్ ఎజెండా ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే రేపటి సమాశంలో బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని లేఖలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటికే కృష్ణాపై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో తెలంగాణ ఎజెండాను పంపించింది. ఏపీ ఇచ్చిన బనకచర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈరోజు (మంగళవారం) ఉదయాన్నే కేంద్రానికి మరో లేఖ రాసింది తెలంగాణ సర్కార్. రేపటి సమావేశంలో బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని లేఖలో స్పష్టం చేసింది. జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఏసీ బనకచర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి.
ఇప్పటి వరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవంటూ పూర్తి వివరాలను లేఖలో ప్రస్తావించింది. అందుకే చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది రేవంత్ సర్కార్. గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటం అనుచితమని లేఖ రాసింది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని తెలంగాణ ప్రభుత్వం లేఖలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?..
వాకింగ్ చేస్తున్న నేతపై కాల్పులు.. హైదరాబాద్‌లో దారుణం
Read latest Telangana News And Telugu News