CPI Leader Shot Dead: వాకింగ్ చేస్తున్న నేతపై కాల్పులు.. హైదరాబాద్‌లో దారుణం
ABN , Publish Date - Jul 15 , 2025 | 09:42 AM
CPI Leader Shot Dead: భాగ్యనగరంలో దారుణం జరిగింది. సీపీఐ నేతపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్, జులై 15: నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో (Dilsukhnagar) కాల్పుల కలకలం రేగింది. సీపీఐ నేత చందు నాయక్‌పై (CPI Leader Chandu Naik) ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శాలివాహననగర్‌లోని పార్క్ వద్ద సీపీఐ నేతపై కాల్పులు జరిపారు దుండగులు. ఈరోజు (మంగళవారం) ఉదయం చందు నాయక్ వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రత్యర్థులు కాపు కాచి మరీ హత్య చేశారు. స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఆయనను అడ్డగించిన ప్రత్యర్థులు ముందుగా అతడి కళ్లలో కారం కొట్టారు. దీంతో భయాందోళనకు గురైన చందు అక్కడి నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెత్తాడు. అయితే చందును వెంటాడి వెంబడించి మరీ గన్‌తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు దుండగులు. దీంతో చందు నాయక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఆపై అక్కడి నుంచి దుండుగలు స్విఫ్ట్ కారులో పరారయ్యారు. హత్య సమయంలో ఐదుగురు ఉన్నట్లు ప్రాథమిక అంచనా. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని చందు నాయక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలే హత్యకు కారణాలుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నాగరకర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన చందు నాయక్ కుటుంబంతో చైతన్యపూరిలో నివాసం ఉంటున్నారు. మృతుడు గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీపీఐ నేత చందు నాయక్ హత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఘటన స్థలంలో ఏడు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు గన్‌లతో ఫైరింగ్ చేసినట్లు కాప్స్ అనుమానిస్తున్నారు. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ ఘటన స్థలానికి చేరుకున్నారు. పలు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చందుపై ఉన్న పాత కేసులను పరిశీలిస్తున్నారు. సీపీఐఎంఎల్ రాజేష్‌తో చందు నాయక్ మధ్య వివాదాలు ఉన్నట్లు గుర్తించారు. నాగోల్ ప్రభుత్వ స్థలంలో కొంతమంది ప్రజలు గుడిసెలు వేసుకున్నారు. దాంతో అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులే చందుకు ప్రత్యర్థులుగా మారారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?..
44 ఏళ్ల కెరీర్‌లో నేను నేర్చుకున్నది ఇదే.. అనుభవాలను పంచుకున్న ఆనంద్ మహీంద్రా
Read latest Telangana News And Telugu News