Hanumakonda: యువతి మోజులో పడి భర్త వేధింపులు ఉరివేసుకొని భార్య ఆత్మహత్య
ABN , Publish Date - Jul 15 , 2025 | 06:08 AM
ఇన్‌స్టాలో రీల్స్ చేసే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంపై భర్తను నిలదీస్తే.. తీవ్ర మానసిక, శారీరక వేధింపులకు గురిచేయడం, విడాకులిచ్చేసి..

హనుమకొండ జిల్లాలో ఘటన.. ఇన్‌స్టా రీల్స్ చేసే యువతితో భర్త వివాహేతర సంబంధం
ప్రశ్నిస్తే.. విడాకులిస్తా, ఆమెనే పెళ్లి చేసుకుంటానని నిర్లక్ష్యంగా సమాధానం
కొడుకుకే అత్తామామల వత్తాసు
ఆ యువతీ బెదిరింపులు
వరంగల్ క్రైం/హసన్‌పర్తి/వరంగల్ మెడికల్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టాలో రీల్స్ చేసే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంపై భర్తను నిలదీస్తే.. తీవ్ర మానసిక, శారీరక వేధింపులకు గురిచేయడం, విడాకులిచ్చేసి.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని నిర్లక్ష్యంగా మాట్లాడటంతో ఆ భార్య తీవ్ర ఆవేదనకు గురైంది. చివరికి రీల్స్ చేసే ఆ యువతి కూడా ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేయడంతో దిక్కుతోచని స్థితిలో ఆ భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో ఈ ఘటన జరిగింది. భార్యాభర్తలిద్దరూ వైద్యులే! సీఐ చేరాలు కథనం ప్రకారం.. ములుగు జిల్లా కమలాపూర్‌కు చెందిన హృద్రోగ నిపుణుడు అల్లాడి సృజన్ రెడ్డికి 2017లో హసన్‌పర్తికి చెందిన దంత వైద్యురాలైన ప్రత్యూష (35) తో వివాహం జరిగింది. సృజన్-ప్రత్యూష దంపతులకు జానూష (7), జెస్వికాస్ (7నెలలు) సంతానం. హసన్‌పర్తి కాకతీయ వింటేజ్ వెంచర్‌లో ఈ కుటుంబం నివాసం ఉంటోంది. ప్రత్యూష ఎన్‌ఎ్‌సఆర్ ఆస్పత్రిలో దంత వైద్యురాలిగా.. సృజన్‌రెడ్డి ఎంజీఎం ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. తొమ్మిది నెలల క్రితం సృజన్‌కు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెంజర్ అయిన యువతి (25)తో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఇన్‌స్టాలో 2.33 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.
డిజిటల్ ప్రమోషన్‌లో భాగంగా ఆమె సృజన్‌రెడ్డితో ఇంటర్వ్యూ చేసి, ఆ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఇద్దరి మధ్య ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది ప్రత్యూషకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ప్రత్యూష.. తన అత్తామామలైన మధుసూదన్, పుణ్యవతి దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారు సృజన్‌ను మందలించకపోగా ప్రత్యూషనే వేధించడం ప్రారంభించారు. అటు.. ఆ యువతి కూడా ఫోన్ చేసి ప్రత్యూషను బెదిరింపులకు గురిచేసింది. శుక్రవారం సృజన్ తల్లిదండ్రులు.. చిన్నారులు జానూష, జెస్వికా్‌సలను వెంటబెట్టుకొని భద్రాచలంలో ఉంటున్న పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లారు. రెండ్రోజులుగా ఇంట్లో ఒంటరిగా ఉం టున్న సృజన.. ఆదివారం సాయం త్రం గదిలోకి వెళ్లి తలుపులు బిగించుకుని ఉరేసుకుంది. ఇరుగుపొరుగుతో కలిసి సృజన్ ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి తంజావూర్ పద్మావతి ఫిర్యాదు మేరకు సృజన్‌రెడ్డి, అత్తామామలు మధుసూదన్, పుణ్యవతి, ఇన్‌స్ట్రా ఇన్‌ఫ్లూయెంజర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సృజన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. కాగా, హసన్‌పర్తిలో సృజన్ ను విమర్శిస్తూ పోస్టర్‌లు వెలిశాయి. భార్యను చంపిన అల్లాడి సృజన్‌ను వెంటనే శిక్షించాల అని పోస్టర్లలో ఉంది. సృజన్ చిత్రపటంతో కూడిన ఫ్లెక్సీకి చెప్పులదండ వేశారు.