MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఒంటరేనా!?
ABN , Publish Date - Jul 15 , 2025 | 10:46 AM
ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నా.. ప్రస్తుత తరుణంలో జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ శ్రేణులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం చర్చనీయాంశం అవుతోంది.

తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై స్పందించని బీఆర్‌ఎస్ శ్రేణులు
జిల్లాలో స్తబ్దుగా బీఆర్‌ఎస్ నాయకులు
అంటీ ముట్టనట్లుగానే నేతల వ్యవహారం
ఎమ్మెల్సీ మల్లన్న వ్యాఖ్యలను ఖండించని జిల్లా ముఖ్య నేతలు
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో అన్నీతానైన కవిత
నిజామాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై (MLC Kavitha) కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నా.. ప్రస్తుత తరుణంలో జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ శ్రేణులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. కేసీఆర్ కుమార్తెగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కవిత బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. జిల్లాలో పార్టీని ఒంటి చేత్తో నడపగలిగిన కవిత.. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఒకరిద్దరు మండల స్థాయి నాయకులు తప్ప ప్రథమ శ్రేణి నాయకత్వం ఎక్కడ కూడా స్పందించకపోవడం గమన్నార్హం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కవిత గతంలో పార్టీ పరిస్థితిపై లేఖ రాయడం, లేఖ లీక్ కావడం.. అమెరికా పర్యటన నుంచి వచ్చిన ఆమె బహిరంగంగా పార్టీలో దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించడం వంటి విషయాలపై జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు ఎవరూ స్పందించలేదు.
ఆ తర్వాత జిల్లాకు వచ్చిన ఆమెకు ఎక్కడ కూడా బీఆర్‌ఎస్ శ్రేణులు స్వాగతం పలకలేదు. చివరికి ఆమెను స్వాగతం పలుకుతూ పెట్టిన ఫ్లెక్సీలలో సైతం కేసీఆర్ ఫొటో తప్ప.. ఇతర నాయకుల ఫొటోలు ఏవీ పెట్టలేదు. ఆమె పర్యటనకు సైతం బీఆర్‌ఎస్ శ్రేణులు దూరంగానే ఉన్నారు. ఒకరిద్దరు పెద్ద నాయకులు తప్ప ఆమె పర్యటనకు గులాబీ శ్రేణులు దూరంగా ఉండటం చర్చనీయాంశం అయింది. తాజాగా తీన్మార్ మల్లన్న కవితపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లాలో కవిత సొంత మండలం నవీపేట, ఇతరత్ర ప్రాంతాల్లో మండల స్థాయి నాయకులు పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు తప్ప.. ఎక్కడ కూడా ప్రథమశ్రేణి నాయకత్వం స్పందించకపోవడం జిల్లాలో కవిత ఒంటరి అవుతున్నారనే ప్రచారానికి బలం చేకూర్చుతోంది.
ముఖ్య నేతలంతా దూరం..
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కవిత పార్టీలో జరుగుతున్న విషయాలపై తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినప్పటి నుంచి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ నేతలు అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. లేఖ లీక్ కావడం అమెరికా పర్యటన నుంచి వచ్చిన ఆమె కేసీఆర్ వెంట దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించడంతో కవిత అనుచరులు బహిరంగంగానే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వాటిని బీఆర్‌ఎస్ శ్రేణులు తిప్పికొట్టడం వంటివి జరిగాయి. జిల్లాలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓటమికి పరోక్షంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సహకరించారని కవిత అనుచరులు సోషల్ మీడియా వేధికగా వ్యాఖ్యలు చేశారు.
అప్పటి నుంచి బీఆర్‌ఎస్ శ్రేణులకు, కవిత అనుచరులకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ అధిష్టానం సైతం ఎక్కడ కూడా ఖండించకపోవడంతో జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కూడా ఈ విషయంలో స్పందించేందుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తుంది. పార్టీ నాయకత్వం సోషల్ మీడియా వేధికగాకానీ, మీడియా పరంగా కూడా ఎక్కడ కూడా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై ఖండించకపోవడంతో జిల్లా నాయకులు సైతం ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో గుమ్మనంగా ఉన్నారు. ఆమె పార్లమెంట్ సభ్యురాలిగా, ఎమ్మెల్సీగా గతంలో జిల్లాకు పర్యటించిన క్రమంలో జిల్లా నేతలంతా ఆమె వెంట ఉండగా ఇటీవల ఆమె జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా చిన్నా చితక నాయకులు తప్ప పెద్ద నాయకులు ఆమె వెంట వెళ్లలేదు. కవిత ఫోటోలను డీపీగా పెట్టుకోవద్దంటూ ఓ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కవిత అనుచరులను బెదిరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై జిల్లాలో బీఆర్‌ఎస్ శ్రేణులు ప్సందించకపోవడం పార్టీకి, కవితకు దూరం పెరిగినట్లుగా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?..
44 ఏళ్ల కెరీర్‌లో నేను నేర్చుకున్నది ఇదే.. అనుభవాలను పంచుకున్న ఆనంద్ మహీంద్రా
Read latest Telangana News And Telugu News