Share News

Ranganath: అందుకే పేదల ఇళ్లు కూల్చడం లేదు.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 18 , 2025 | 10:27 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో సామాజిక కోణంలో చూసి పేదల ఇళ్లు కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీన బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని రంగనాథ్ పేర్కొన్నారు.

Ranganath: అందుకే పేదల ఇళ్లు కూల్చడం లేదు.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
Ranganath

హైదరాబాద్: భావితరాలకు భవిష్యత్‌ని ఇవ్వడం కోసం హైడ్రా (HYDRA) పని చేస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) ఉద్ఘాటించారు. చెరువులను కాపాడాలనే ఉద్దేశ్యంతో మొదట్లో తాము చాలా దూకుడుగా వెళ్లడంతో చెరువుల ఆక్రమణలు తగ్గాయని గుర్తుచేశారు. హైడ్రా ఏర్పాటు చేసి శుక్రవారం(జులై18)తో ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా అంబర్‌పేట్ బతుకమ్మ కుంట వద్ద హైడ్రా ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ కలెక్టర్ హరి చందన, మాజీ ఎంపీ వి. హనుమంతురావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగనాథ్ మీడియాతో మాట్లాడారు.


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో సామాజిక కోణంలో చూసి పేదల ఇళ్లు కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీన బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు. హైడ్రా అంటే డిమాలీషన్, డెవలప్‌మెంట్ అని అభివర్ణించారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన బతుకమ్మకుంట శాంపిల్ మాత్రమేనని.. త్వరలో ఎన్నో బతుకమ్మ కుంటలు వెలుగులోకి వస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.


ఏడాదిలో హైడ్రా సాధించినవి ఇవే..

హైడ్రా ఏర్పాటు అయి నేటికి ఏడాది పూర్తి అయింది. 2024 జులై 19వ తేదీన హైడ్రాను రేవంత్‌రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీతో పాటు ORR లోపలి వరకు 2050 కిలోమీటర్ల మేర హైడ్రా పరిధిలో ఉంది. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఫుట్ పాత్‌లు, రహదారుల అక్రమణల భరతం హైడ్రా పడుతోంది. ఏడాది కాలంలో 600 చోట్ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి 500 ఎక‌రాల భూమిని  హైడ్రా కాపాడింది. ఏడాది కాలంలో క‌బ్జాల చెర నుంచి దాదాపు 500 ఎక‌రాల‌కు విముక్తి కల్పించింది. 360 ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలు తొలగించి 133 ఎకరాలు భూమిని కాపాడింది హైడ్రా.


ప్ర‌భుత్వ‌, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను క‌బ్జాల చెర నుంచి హైడ్రా విముక్తి కల్పించింది. 86 చోట్ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి 123 ఎకరాలను కాపాడింది. 20 చోట్ల నాలాల ఆక్రమణలను తొలగించడంతో 8 ఎకరాల స్థలాలకి మోక్షం లభించింది. 74 చోట్ల రహదారి ఆక్రమణలను తొల‌గించి.... దాదాపు 220 ఎకరాల మేర రహదారి ఆక్రమణలను కాపాడింది. చెరువుల ఆక్రమణలు తొలగించిన చోట చెరువులకు పూర్వవైభవం తెస్తోంది. మొదటి విడతలో ఆరు చెరువులను సుందరీకరణ చేస్తోంది. అంబర్‌పేట బతుకమ్మ కుంట, కూకట్‌పల్లి నల్ల చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, తమ్మిడి కుంట చెరువు, ఉప్పల్ పెద్ద చెరువు, పాతబస్తీలోని బమ్రాక్ నుద్దౌలా చెరువులను హైడ్రా సుందరీకరణ చేస్తోంది. వచ్చే బతుకమ్మ పండుగకు అంబర్‌పేట బతుకమ్మ కుంటను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.


ఇవి కూడా చదవండి..

మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు

ఉగ్రవాద కార్యకలాపాలపై అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 18 , 2025 | 12:20 PM