Ramachander Rao Warns BRS: వారిపై దాడి చేశారో ఖబడ్దార్.. బీఆర్‌ఎస్‌కు రామచందర్ రావు వార్నింగ్
ABN , Publish Date - Jul 07 , 2025 | 12:22 PM
Ramachander Rao Warns BRS: మీడియా సంస్థలపై, అమాయక ప్రజలపై దాడులు చేశారో ఖబడ్దార్.... అంతు చూస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు హెచ్చరించారు. మీడియా సంస్థలను బీజేపీ గౌరవిస్తోందన్నారు. తమకు వ్యతిరేకంగా రాసినా, కథనాలు ప్రచారం చేసినా తప్పులుంటే సరిదిద్దుకుంటామని తెలిపారు.

హైదరాబాద్, జులై 7: మీడియా సంస్థలపై బీఆర్‌ఎస్ దాడులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు (Telangana BJP Chief Ramachandar Rao) తీవ్రంగా ఖండించారు. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN - Andhrajyothy) మీడియా సంస్థలపై బీఆర్ఎస్ మూకలు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసుల నంచి సమాచారం వచ్చిందన్నారు. బీఆర్ఎస్ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. ప్రజలు ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించినా బుద్ధి రాలేదన్నారు. మీడియా సంస్థలపై గులాబీ శ్రేణుల దాడులు దుర్మార్గమని వ్యాఖ్యలు చేశారు. మీడియా సంస్థలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థలకు రక్షణ కల్పించాలని బీజేవైఎం కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా తప్పుగా రాస్తే న్యాయపరంగా చర్యలు తీసుకోవాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
బీఆర్‌ఎస్ నేతలకు హెచ్చరిక
ఇకపై మీడియా సంస్థలపై, అమాయక ప్రజలపై దాడులు చేశారో ఖబడ్దార్.. అంతు చూస్తామని హెచ్చరించారు. మీడియా సంస్థలను బీజేపీ గౌరవిస్తోందన్నారు. తమకు వ్యతిరేకంగా రాసినా, కథనాలు ప్రచారం చేసినా తప్పులుంటే సరిదిద్దుకుంటామని తెలిపారు. కావాలని తప్పుడు వార్తలు రాస్తే చట్ట, న్యాయపరంగా ముందుకు వెళతామే తప్ప దాడులు చేయబోమని చెప్పారు. ఎందుకంటే వాక్ స్వాతంత్ర్యాన్ని గౌరవించే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ‘మీడియా సంస్థలపై దాడులు చేశారో ఖబడ్దార్... టీ న్యూస్ అంతు చూస్తాం’ అంటూ బీఆర్‌ఎస్ నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ సర్కార్‌కు అల్టిమేటం..
అలాగే.. పాతబస్తీ సల్కం చెరువు భూమిలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కట్టిన కాలేజీలో వేల మంది పిల్లలు చదువుతున్నందున వారి జీవితాలను నాశనం చేయలేమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్‌కు ఒక న్యాయం.. అట్టడుగు పేదలకు ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ కాలేజీల్లో చదివే వాళ్ల జీవితాలే ముఖ్యమా అని నిలదీశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది పేదల జీవితాలు పట్టవా అని మండిపడ్డారు. కష్టపడి చెమటోడ్చి ఇండ్లు కట్టుకున్న మధ్య తరగతి ప్రజలు బతుకులు లెక్కలేవా అంటూ ఫైర్ అయ్యారు. తక్షణమే అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్ కాలేజీ భవనాన్ని కూల్చివేస్తారా? లేదా?.. లేకపోతే ప్రజల పక్షాన ఆ పని తామే చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు అల్టిమేటం జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
డాక్టర్లు చేయలేని పని చాట్ జీపీటీ చేసింది..
Read latest Telangana News And Telugu News