CM Revanth Reddy: తెలంగాణ మహిళలు ప్రపంచంతో పోటీ పడుతున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Jul 07 , 2025 | 10:40 AM
ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. మీ పిల్లల్లాగే వాటిని సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందని ఉద్గాటించారు.

హైదరాబాద్: ప్రకృతిని మనం కాపాడితేనే.. ప్రకృతి మనల్ని కాపాడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ‘వనమే మనం… మనమే వనం’ అని పెద్దలు చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పుకొచ్చారు. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. అమ్మలు కూడా పిల్లల పేరుతో ఓ మొక్కను నాటాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. మీ పిల్లల్లాగే వాటిని సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందని ఉద్గాటించారు. ఇవాళ(సోమవారం) ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వనమహోత్సవం- 2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుద్రాక్ష మొక్కను నాటి వనమహోత్సవాన్ని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, వేం నరేందర్ రెడ్డి. పీసీసీఎఫ్ డా. సువర్ణ, ఇతర అటవీ అధికారులు పాల్గొన్నారు. అనంతరం అటవీ శాఖ HMDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
మహిళలను ప్రోత్సహిస్తూ తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను ఆడబిడ్డలకు అప్పగించామని గుర్తుచేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదని.. ఆర్టీసీకి వెయ్యి బస్సులను అద్దెకు ఇచ్చేలా ప్రోత్సహించి వారిని బస్సులకు యజమానులను చేశామని పేర్కొన్నారు. హైటెక్ సిటీలో విప్రో, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉండేచోట మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పించామని వెల్లడించారు. తెలంగాణ మహిళలు ప్రపంచంతో పోటీ పడుతున్నారని చెప్పుకొచ్చారు. మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను చూసి మిస్‌వరల్డ్ పోటీదారులు అభినందించారని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు సీఎం రేవంత్‌రెడ్డి.
తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి బస్సులకు మహిళలు యజమానులు అయ్యారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. హై టెక్ సిటీ పక్కన మహిళా శక్తి భవన్ నిర్మించామని గుర్తుచేశారు. ఐకేపీ సెంటర్ల ద్వారానే వడ్లు కొనుగోలు జరుగుతోందని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఆడబిడ్డలను పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ల వరకు మంత్రివర్గంలో మహిళలు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ తెచ్చిందే కాంగ్రెస్ అని ఉద్ఘాటించారు. త్వరలోనే చట్టసభల్లో కూడా మహిళలకు 33శాతం రిజర్వేషన్ రాబోతుందని ప్రకటించారు. 51 అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వ్ కానున్నాయని చెప్పుకొచ్చారు. 51కి మరో పది కలిపి మహిళలకు ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ (సోమవారం) ఢిల్లీలో పర్యటించనున్నారు. మధ్యాహ్నానికి ఢిల్లీకి సీఎం చేరుకోనున్నారు. రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. మధ్యాహ్నం 2.30కి కేంద్ర క్రీడలు, కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణ రాష్టానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై సీఎం చర్చించనున్నారు. కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి మాట్లాడనున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని కోరనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అలాగే బనకచర్ల అంశంపై మరోసారి కేంద్రమంత్రిని కలిసి చర్చించనున్నారు. ఇప్పటికే బనకచర్ల అనుమతులని పర్యావరణ కమిటీ నిరాకరించింది. మరోసారి బనకచర్ల ప్రాజెక్ట్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణకు పెండింగ్‌లో ఉన్న నిధులపై కేంద్రమంత్రులను కలవనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో నిధుల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. 42 శాతం రిజర్వేషన్ ఆమోదంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం చర్చించనున్నారు. విభజన సమస్యల పరిష్కారానికి ఢిల్లీ పెద్దలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఈ వార్తలు కూడా చదవండి
వరంగల్ పర్యటనలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. విద్యార్థి సంఘాల నేతల అరెస్టుతో ఉద్రిక్తత
సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Read Latest Telangana News And Telugu News