MP Kiran Kumar Reddy: కేటీఆర్ అండ్ కో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
ABN , Publish Date - Nov 21 , 2025 | 05:43 PM
కేటీఆర్ అండ్ కో తెలంగాణకు మంచి చేయరని... తాము చేస్తుంటే అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కేటీఆర్ వ్యాపారవేత్తలను బెదిరించారని ఆరోపించారు.
హైదరాబాద్, నవంబరు21(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్ (KTR)కి కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకం అంతా పచ్చగానే కనపడుతోందని.. కేటీఆర్‌కి కూడా అలాగే ఉందని విమర్శించారు. ఇవాళ(శుక్రవారం) గాంధీభవన్‌లో మీడియాతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఫాం హౌస్ పాలన తప్పా.. ప్రజాపాలన ఎక్కడా చేయలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో కేబినెట్‌లో అన్ని నిర్ణయాలు జరుగుతాయని కేటీఆర్ గతంలో ఒప్పుకున్నారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే కేటీఆర్ పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
రేవంత్‌రెడ్డి కుటుంబంలో ఎంతమంది తమ ప్రభుత్వంలో ఉన్నారో కేటీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. కేటీఆర్ లాగా ఇంట్లో ఉన్నోళ్లందరికీ రాజకీయ పదవులను తమ ప్రభుత్వంలో ఇవ్వలేదని స్పష్టం చేశారు. కేటీఆర్ పదేళ్లు ఏం చేశారని, తెలంగాణకు తీసుకువచ్చిన పెట్టుబడులు ఏమయ్యాయని ప్రశ్నల వర్షం కురిపించారు. కేటీఆర్ అండ్ కో తెలంగాణకు మంచి చేయరని... తాము చేస్తుంటే అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. వ్యాపారవేత్తలను కేటీఆర్ బెదిరించారని ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ని ఓడగొట్టినా కేటీఆర్‌కు బుద్ధి మారలేదని ఎద్దేవా చేశారు. చివరికి జూబ్లీహిల్స్‌లో ఓడగొట్టినా కేటీఆర్ మారడం లేదని విమర్శలు చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
దోచుకున్న సొమ్ముతో కేటీఆర్ విర్రవీగుతున్నారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

ఒక ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తేనే మాజీ మంత్రి కేటీఆర్ తట్టుకోలేక పోతున్నారని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ (Balmoor Venkat) విమర్శించారు. ఇవాళ(శుక్రవారం) గాంధీభవన్‌లో మీడియాతో బల్మూర్ వెంకట్ మాట్లాడారు. ఇంకో రెండు ఉప ఎన్నికలు వస్తే కేటీఆర్ అమెరికా పారిపోతారని ఎద్దేవా చేశారు. నేతలు ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి దమ్ము, ధైర్యం ఏంటో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చూపెట్టారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తూ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. జైలుకు పోవాలనే ఉత్సాహం కేటీఆర్‌కు ఎక్కువగా ఉందని సెటైర్లు గుప్పించారు.
పదేళ్లు అడ్డగోలుగా దోచుకున్న సొమ్ముతో కేటీఆర్ విర్రవీగుతున్నారని మండిపడ్డారు. రూ. 55 కోట్ల విలువ చేసే 20 ఎకరాల భూమిని సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడికి కేటీఆర్ కట్టబెట్టారని ఆరోపించారు. ఫార్ములా ఈ కారు రేసు కేసు గురించి కేటీఆర్ ప్రెస్‌మీట్‌లో ఒకలా, కోర్టులో మరొకలా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. జాతిపితలా కేటీఆర్ బిల్డప్ ఇస్తున్నారని దెప్పిపొడిచారు. కేటీఆర్ ఆరోపణలపై తమ ప్రభుత్వం లెక్కలతో సహా బయటపెట్టిందని స్పష్టం చేశారు. కవిత ఆరోపణలపై కేటీఆర్, హరీశ్‌రావు వెంటనే స్పందించాలని ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే.. మరోవైపు అరెస్ట్ కాకుండా కోర్టు మెట్లు ఎక్కుతున్నారని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారతదేశంలో స్వదేశీ వస్తువుల వినియోగం పెరగాలి: రామచంద్రరావు
బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ సిట్ దూకుడు.. విచారణకు హాజరైన హీరోయిన్లు
Read Latest Telangana News And Telugu News