Kiran Kumar Reddy Fires KTR: కేసీఆర్ హయాంలో చెరువులు, నాళాల కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు: ఎంపీ చామల
ABN , Publish Date - Nov 02 , 2025 | 06:15 PM
మాజీమంత్రి కేటీఆర్‌కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.హైడ్రాని భూతంలా చూపించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.
హైదరాబాద్, నవంబరు2 (ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి కేటీఆర్ (KTR)కు భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddyy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.హైడ్రాని భూతంలా చూపించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గాంధీభవన్‌లో ఎంపీ చామల ఇవాళ (ఆదివారం) మీడియాతో మాట్లాడారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్లు దండుకోవడం కోసం కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రాను సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని ఉద్ఘాటించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా పర్మిషన్లని ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో పర్మిషన్లు ఇవ్వడంతోనే ప్రభుత్వ భూములు కబ్జాలకు గురి అయ్యాయని గుర్తుచేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
75 శాతం చెరువులు, నాళాలు కబ్జా..
తెలంగాణ, హైదరాబాద్‌లో 75 శాతం చెరువులు, నాళాలు కబ్జాకు గురైనట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నివేదిక ఇచ్చిందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 600 చెరువులు ఉంటే బీఆర్ఎస్ హయాంలో 44 చెరువులు మొత్తం ఎలా మాయం అయ్యాయని నిలదీశారు. 127 చెరువులు సగానికి సగం కబ్జాకు గురి అయ్యాయని చెప్పుకొచ్చారు. కేటీఆర్ పదేళ్లు మున్సిపల్ శాఖామంత్రిగా ఉండి చెరువులు, నాళాల కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకంతోనే అమాయకులు వెళ్లి హైడ్రా బారిన పడ్డారని తెలిపారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
శేరిలింగంపల్లి, హఫీజ్‌పేట్‌లో 39 ఎకరాల ప్రభుత్వ భూమిని వసంత కృష్ణప్రసాద్ కబ్జా చేసి బిల్డింగులు కడితే 29 ఎకరాల్లో హైడ్రా ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమిని కాపాడిందని గుర్తుచేశారు. హైడ్రా వచ్చిన తర్వాత 500 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని ఉద్ఘాటించారు. 360 చెరువుల్లో కబ్జాలను హైడ్రా తొలగించిందని వివరించారు. 20 నాళాల మీద ఆక్రమణలు, 38 పార్కుల కబ్జాలను హైడ్రా తొలగించిందని పేర్కొన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది :చామల కిరణ్ కుమార్ రెడ్డి
‘దేవరయాంజాల్‌లో ప్రభుత్వ భూమిని, అప్రోచ్ రోడ్లను హైడ్రా కాపాడింది. గచ్చిబౌలిలో సంధ్యా శ్రీధర్‌రావు అనే వ్యక్తి ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 162 ఫ్లాట్ ఓనర్ల భూములను బెదిరించి కబ్జా చేస్తే హైడ్రా కాపాడింది. హైడ్రా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి వచ్చింది కాదు. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం బయటపెట్టడం కోసం హైడ్రా ఏర్పడింది. హైదరాబాద్ నగరం వరద ముంపునకు గురి కాకుండా ఉండటం కోసం హైడ్రా కృషి చేస్తోంది. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, లండన్ చేస్తామని కేసీఆర్ హయాంలో ప్రజలను మభ్యపెట్టారు. హైదరాబాద్ నగరంలో ఉన్న నాళాల్లో మట్టిని సైతం బీఆర్ఎస్ హయాంలో తీయలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం హైడ్రా గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు. హైడ్రాతో లబ్ధి పొందిన ప్రజలు బయటకు వచ్చి మాట్లాడాలి’ అని చామల కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌రెడ్డి నయా ప్లాన్
షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
Read Latest Telangana News And Telugu News