Mallu Bhatti Vikramarka: తెలంగాణలో పెరిగిన విద్యుత్ డిమాండ్
ABN , Publish Date - Jun 17 , 2025 | 06:10 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.

జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పక్క అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ ప్రభుత్వంపై గగ్గోలు పెడుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు డబుల్ బెడ్ రూం ఇళ్లు, వడ్డీ లేని రుణాలు, ఉచిత విద్యుత్, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు కల్పించలేక పోయిందని ప్రశ్నించారు. ఇవాళ(మంగళవారం) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోరికొత్తపల్లి మండలం చెన్నాపూర్ గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాన్ని మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రజల సమస్యలపై నిరంతరం కృషి చేసే ప్రజా ప్రతినిధులు ఉండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు మల్లు భట్టి విక్రమార్క.
2023 మార్చిలో 15 వేల మెగావాట్ల డిమాండ్ ఉంటే.. 2025 మార్చిలో 17 వేల మెగా వాట్ల డిమాండ్‌లను సైతం పెంచి విద్యుత్‌కి అంతరాయం లేకుండా సరఫరా అందజేస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. రూ. 21 వేల కోట్లు రైతు రుణమాఫీని మూడు నెలల్లో జమ చేశామని తెలిపారు. రైతులకు రూ. 13600 కోట్లు రైతు భరోసా అందించామని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు తమ ప్రభుత్వం రైతులకు అందిస్తోందని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
‘ధరణి’పై ఫోరెన్సిక్ ఆడిట్ షురూ
Read Latest Telangana News And Telugu News