Lal Darwaja: అట్టహాసంగా లాల్ దర్వాజా బోనాలు ప్రారంభం
ABN , Publish Date - Jul 20 , 2025 | 07:16 AM
లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఇవాళ ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు (Lal Darwaja Simha Vahini Mahankali Ammavari Bonalu) ఇవాళ (ఆదివారం, జులై20) ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి బోనాల కోసం పోలీసులు భారీ భద్రత నిర్వహిస్తున్నారు. సుమారు 2500 మంది పోలీసులతో ప్రభుత్వం పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. బోనాలు జరుగుతున్న తీరును సమీక్షించేందుకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి బోనాల భద్రతా విధుల్లో సిటీ పోలీసులతోపాటు జిల్లా పోలీసులు కూడా పాల్గొన్నారు. జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు జరగకుండా క్రైమ్ పార్టీలు ఆ ప్రాంతాల్లో మోహరించాయి. బోనాల్లో పోకిరిల ఆట కట్టించేందుకు మఫ్టీల్లో షీ టీమ్స్ తిరుగుతున్నాయి. సున్నితమైన ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. ఇప్పటికే బోనాల సందర్భంగా వైన్ షాప్‌లని ప్రభుత్వం మూసివేసింది. బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News