Share News

KTR: రాహుల్ గాంధీకి కేటీఆర్ సంచలన లేఖ

ABN , Publish Date - Nov 30 , 2025 | 06:45 PM

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు కేటీఆర్.

KTR: రాహుల్ గాంధీకి కేటీఆర్ సంచలన లేఖ
KTR

హైదరాబాద్, నవంబరు30 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఇవాళ(ఆదివారం) బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ పాలసీ (HILTP)ను స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద భూ కుంభకోణాల్లో ఒకటని ఆరోపణలు చేశారు. అత్యంత అవినీతితో కూడుకున్న ఈ విధానం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన, అనుమానాలు కలిగిస్తోందని విమర్శించారు.


రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ హై కమాండ్‌కు తెలుసా.. లేకపోతే కావాలని మౌనంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ అవినీతి కారణంగా అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలు వాటి అసలు మార్కెట్ విలువలో నామమాత్రపు ధరకే పూర్తిగా సొంతం చేసుకోవడానికి వీలు కల్పిస్తోందని అన్నారు. దీనివల్ల తెలంగాణ ప్రజలకు రూ.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కేటీఆర్ హెచ్చరించారు.


హైదరాబాద్ నగరంలోని బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, ఉప్పల్, మల్లాపూర్, రామచంద్రాపురం, హయత్‌నగర్ వంటి కీలక క్లస్టర్‌లలో గత ప్రభుత్వాలు సుమారు 9,300 ఎకరాల పారిశ్రామిక భూమిని కేటాయించాయని గుర్తుచేశారు. ఈ భూములను మొదట పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన, దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి రాయితీ ధరలకు ఇచ్చారని పేర్కొన్నారు కేటీఆర్.


అయితే, కొత్త HILTP కింద, పారిశ్రామిక భూములను కలిగి ఉన్నవారు ఇప్పుడు ఆ భూములను వాణిజ్య లేదా నివాస జోన్‌లుగా మార్చుకోవడానికి SRO (సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం) విలువలో కేవలం 30శాతం మాత్రమే చెల్లిస్తే చాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుత మార్కెట్ ధరల చాలా రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ విధానం ప్రజలకు దక్కాల్సిన ఆస్తులను తక్కువ ఖర్చుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, లక్షల కోట్ల విలువైన భూమిని నామమాత్రపు ధరకు క్రమబద్ధీకరిస్తోందని తెలిపారు.


వేల కోట్ల విలువైన ఆస్తుల మార్పిడికి 45 రోజుల్లో ఫాస్ట్-ట్రాక్ ఆమోదాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. ఇంత తొందరపాటుతో కూడిన ప్రక్రియలో పారదర్శకతలేదని, కేవలం డబ్బులు దండుకోవాలనే సరైన విచారణ లేకుండానే ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటుతనం, ఈ మొత్తం పాలసీలో దాగున్న రాజకీయ అవినీతి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందని ధ్వజమెత్తారు.


అలాగే, రాహుల్ గాంధీకి రెండు కీలక ప్రశ్నలు సంధించారు కేటీఆర్. తెలంగాణలో పెద్దఎత్తున జరుగుతున్న అక్రమాల గురించి వెంటనే స్పందించాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న రూ.5 లక్షల కోట్ల అవినీతి స్కామ్‌ని అడ్డుకోవాలని సూచించారు. లేకపోతే దేశ చరిత్రలోనే అతిపెద్ద భారీ భూ కుంభకోణంలో రాహుల్ గాంధీ మౌనంగా ఉండటం సరికాదని అన్నారు. రాహుల్ గాంధీ స్పదించకపోతే ఈ స్కాంలో భాగస్వామ్యం ఉందని, కాంగ్రెస్ హైకమాండ్ అనుమతితోనే రూ.5 లక్షల కోట్ల భూకుంభకోణం తెలంగాణలో జరుగుతోందని భావించాల్సి ఉంటుందని అన్నారు. రాహుల్ గాంధీ ఈ అంశంలో ఇప్పటికైనా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ అవినీతికి అడ్డుకట్ట వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


కాంగ్రెస్ తన అవినీతి కోసం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తాము ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తునే ఉంటామని స్పష్టం చేశారు. తాను రాస్తున్న ఈ బహిరంగ లేఖకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ హై కమాండ్ ఇచ్చే సమాధానం తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలని కోరారు కేటీఆర్.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల నిబంధనను ఉల్లంగిస్తున్నారు.. కవిత ఫైర్

నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం: ఎంపీ సురేశ్‌రెడ్డి

Read Latest TG News and National News

Updated Date - Nov 30 , 2025 | 07:13 PM