Share News

KTR: ఆ బ్లాక్ మార్కెట్ దందా ఎవరూ నడిపిస్తున్నారో తెలియాలి.. కేటీఆర్ హాట్ కామెంట్స్

ABN , Publish Date - Jul 06 , 2025 | 01:12 PM

రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు.

KTR: ఆ బ్లాక్ మార్కెట్ దందా ఎవరూ నడిపిస్తున్నారో తెలియాలి.. కేటీఆర్ హాట్ కామెంట్స్
KTR

హైదరాబాద్: రైతు సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం (Revanth Government) నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా లేదు.. రైతు రుణమాఫీ లేదని మండిపడ్డారు. కనీసం అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూడా కరువు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా రైతు సమస్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.


రేవంత్ ప్రభుత్వం అడిగినట్లుగా రైతులు ఆధార్ కార్డులు ఇచ్చినా, వారికి కనీసం బస్తా ఎరువు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఎందుకుందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల లోటు ఎందుకుందో రైతులకు రేవంత్ ప్రభుత్వం వివరించాలని కోరారు. రూ.266.50 ఉండాల్సిన బస్తా యూరియా ధర ఇప్పుడు రూ.325 ఎలా అయ్యిందో రైతులకే కాదు, రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలియాలని నిలదీశారు. ఈ బ్లాక్ మార్కెట్ దందాను దగ్గరుండి నడిపిస్తోంది ఎవరని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కృత్రిమ కొరత ఎవరివల్ల ఏర్పడుతుందో చెప్పాలని అన్నారు. ఆఖరికి ఎరువులను కూడా బుక్కేస్తున్న మెతన్నలు ఎవరో వెంటనే రేవంత్ ప్రభుత్వం విచారణ జరిపించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.


పదేళ్ల కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం పండుగలా మారింది: హరీష్‌రావు

Harish Rao

పదేళ్ల కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఉద్ఘాటించారు. కేసీఆర్‌ పాలనలోని పదేళ్లలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని చెప్పుకొచ్చారు. రైతు పక్షపాతిగా నిలిచిన కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనపై కాంగ్రెస్ నేతలు బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు నీటి విలువ తెలియడం లేదని హరీష్‌రావు విమర్శించారు.


కేసీఆర్‌పై కక్షతో రైతులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శిక్ష వేస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. కన్నేపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీరు తీసుకోవచ్చని.. కానీ రేవంత్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం స్విచ్‌ ఆఫ్‌ మోడ్‌లో ఉందని ఎద్దేవా చేశారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా నీళ్లు తీసుకోవచ్చని అన్నారు. కాళేశ్వరం మోటార్లు ఆన్‌ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని కోరారు. లేకపోతే తామే కన్నేపల్లి వెళ్లి మోటార్లు ఆన్‌చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో రైతులతో కలిసి వెళ్తామని హరీష్‌రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం

డిజిటల్‌ అరెస్టు పేరుతో.. వృద్ధుడికి రూ.53 లక్షల కుచ్చుటోపీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 06 , 2025 | 01:54 PM