KTR: జూబ్లీహిల్స్‌ను మనమే దక్కించుకుందాం..
ABN , Publish Date - Aug 04 , 2025 | 08:03 AM
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని.. సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న అవినీతి, కుంభకోణాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపాడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రెండు జాతీయపార్టీల ఎజెండా బీఆర్‌ఎస్ పార్టీని ఓడించడమేనని, అందుకే ప్రధాని మోదీ ఇప్పటివరకు కుంభకోణాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ సీఎంపై ఒక్క కేసు కూడా పెట్టలేదని విమర్శించారు.

జూబ్లీహిల్స్‌ను మనమే దక్కించుకుందాం
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు
బీఆర్‌ఎ్‌సను ఓడించడమే ఆ రెండు పార్టీల ఎజెండా
ప్రజలను మోసగించిన కాంగ్రెస్‌కు ఉప ఎన్నికలో కర్రుకాల్చి వాతపెట్టాలి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congres) పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని.. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) చేస్తున్న అవినీతి, కుంభకోణాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపాడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు జాతీయపార్టీల ఎజెండా బీఆర్‌ఎస్ పార్టీని ఓడించడమేనని, అందుకే ప్రధాని మోదీ ఇప్పటివరకు కుంభకోణాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ సీఎంపై ఒక్క కేసు కూడా పెట్టలేదని విమర్శించారు. ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జునఖర్గే డిక్లరేషన్ల పేరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసంచేశారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్.
రాష్ట్రంలో కాంగ్రెస్ 20 నెలల అసమర్థ, అరాచక, అవినీతిపాలనకు గట్టిగా బుద్ధి చెప్పాలని, ప్రజలను మోసగించిన కాంగ్రెస్‌కు రానున్న ఉప ఎన్నికలో కర్రుకాల్చి వాతపెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నిర్వహించే ఉపఎన్నికను సీరియ్‌సగా తీసుకోవాలని, ఆ స్థానాన్ని మనమే దక్కించుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు ఆగిపోయాయని, మళ్లీ ఆ పార్టీకి ఓటేస్తే.. తమ మోసాలను ప్రజలు అంగీకరిస్తున్నారని భావించి ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలనూ ఆపేస్తారన్నారు. పేదవాడు ప్రభుత్వ స్థలంలో చిన్నగూడు కట్టుకుంటే దాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారని, ధనికుల ఇళ్ల వద్దకు మాత్రం హైడ్రా పోదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు, మంత్రులు, కాంగ్రెస్‌నేతలు చెరువుల్లో ఇళ్లు కట్టుకుంటే కన్నెత్తి చూడని హైడ్రా.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లను సెలవు దినాల్లో కూల్చివేస్తోందన్నారు. కూకట్‌పల్లిలో ఇల్లు కూలుస్తారనే భయంతో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోవడం తనకు ఆవేదన కలిగించిందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొ న్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలు, పిల్లల రక్షణపై స్పెషల్ ఫోకస్
డ్రగ్స్ కేసుల్లో పబ్బులకు లింకులు
Read latest Telangana News And Telugu News