Konda Murali: నేను దేనికీ భయపడ: కొండా మురళి
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:06 PM
Konda Murali: తాను బలహీనుడినా.. బలవంతుడినా అనేది అందరికీ తెలుసని.. తనను రెచ్చగొట్టొద్దని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. గాంధీభవన్‌లో క్రమ శిక్షణ కమిటీతో కొండా మురళి సమావేశమయ్యారు.

హైదరాబాద్, జూన్ 28: కాంగ్రెస్ పార్టీ అంటే తనకు గౌరవం ఉందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి (Former MLC Konda Muarli) అన్నారు. ఈరోజు (శనివారం) గాంధీభవన్‌లో (Gandhi Bhavan) క్రమ శిక్షణా కమిటీతో కొండా మురళీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 15 పేజీలతో కూడిన నివేదికను కమిటీకి ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం మాజీ ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌తో కాంగ్రెస్‌పై తనకు అభిమానం పెరిగిందన్నారు. రాహుల్ గాంధీని (Rahaul Gandhi) ప్రధాన మంత్రిని చేయాలనే తపన తనలో ఉందన్నారు. బహిరంగ విమర్శలు చేయడం మంచిదో చెడునో అంతరాత్మకు తెలుసన్నారు.
‘నేను బలహీనుడినా.. బలవంతుడినా అనేది అందరికీ తెలుసు. నన్ను రెచ్చగొట్టొద్దు. నేను రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వచ్చా. కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి రాజీనామా చేస్తారో లేదో ఆయనే తేల్చుకోవాలి. బీసీలను గౌరవించాలని కోరా. నేను దేనికి భయపడను. సీఎం, పీసీసీ అంటే గౌరవం ఉంది. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వరంగల్‌లో మాట్లాడుతా’ అని కొండా మురళి పేర్కొన్నారు.
కాగా.. గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో వివిధ జిల్లాల్లో నాయకుల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఒక వర్గంగా.. మిగిలిన ఎమ్మెల్యేలు మరో వర్గంగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న పరిస్థితి. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో ఆ బాధ్యతను క్రమశిక్షణా కమిటీకి అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ నేపథ్యంలో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గాంధీభవన్‌కు చేరుకుని క్రమశిక్షణ కమిటీతో భేటీ అయ్యారు. కమిటీకి 15 పేజీలతో కూడిన నివేదికను అందజేశారు. గతంలో కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ వివరణ కోరిన నేపథ్యంలో 15 పేజీల లేఖను సమర్పించినట్లు తెలుస్తోంది. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డిపై కమిటీకి ఫిర్యాదు చేశారు కొండా. ఉమ్మడి వరంగల్‌లో ప్రతీ నియోజకవర్గంలో జరుగుతున్న అంశాలపై నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. కడియం, రేవూరి, నాయినిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కొండా మురళి కోరుతున్నారు. కాగా.. క్రమశిక్షణా కమిటీ ముందు హాజరయ్యేందుకు వచ్చిన కొండా మురళీకి మద్దతుగా భారీగా అనుచరులు వచ్చారు. అయితే వారిని గాంధీ భవన్ గేటు వద్దే పోలీసులు నిలిపివేశారు.
ఇవి కూడా చదవండి
నా కూతురు చావుకు కారణం అతడే: స్వేచ్ఛ తండ్రి
Read Latest Telangana News And Telugu News