Share News

Swetcha Suicide Case: నా కూతురు చావుకు కారణం అతడే: స్వేచ్ఛ తండ్రి

ABN , Publish Date - Jun 28 , 2025 | 02:38 PM

Swetcha Suicide Case: యాంకర్ స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ సంచలన కామెంట్స్ చేశారు. మానసిక వేదన వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

Swetcha Suicide Case: నా కూతురు చావుకు కారణం అతడే: స్వేచ్ఛ తండ్రి
Swetcha Suicide Case

హైదరాబాద్, జూన్ 28: టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో (Swetcha Suicide Case) పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్వేచ్ఛ మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు చావుకు పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమని ఆరోపించారు. మూడు సంవత్సరాల నుంచి తన కూతురు వెంట పూర్ణచందర్ పడ్డాడని.. అతడి వేధింపుల వల్లనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని పెళ్లి చేసుకుంటానని మూడు సంవత్సరాల నుంచి పూర్ణచందర్ వెంటపడినట్లు తెలిపారు.


‘నా కూతురు పెళ్లికి అంగీకరించిన తర్వాత ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. గొడవలు తారాస్థాయికి చేరడంతో ఇటీవల నా కూతురు పూర్ణచందర్‌తో ఉండను అని తేల్చి చెప్పింది. జూన్ 26 ఇద్దరికీ గొడవ జరిగితే నన్ను ఇంటికి రమ్మని పిలిచింది. ఆ రోజు నేను స్వేచ్ఛతో మాట్లాడాను.. పూర్ణచందర్‌తో సంబంధం కొనసాగించలేను అని ఖరాఖండీగా చెప్పింది. పూర్ణచందర్ వేధింపుల వల్ల నా కూతురు తీవ్ర మానసిక వేదనకు గురైంది. మానసిక వేదన వల్లే నిన్న ఆత్మహత్య చేసుకుంది’ అంటూ తండ్రి శంకర్ తీవ్ర ఆవేదన చెందారు.


మరోవైపు స్వేచ్ఛ మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం పూర్తి అయ్యింది. కాసేపట్లో రాంనగర్‌లోని పార్సీగుట్టకు స్వేచ్ఛ మృతదేహాన్ని తరలించనున్నారు. ఈరోజు పార్సిగుట్టలోని స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి. స్వేచ్ఛ మృతదేహానికి పోస్టుమార్టం సందర్భంగా గాంధీ మార్చురీ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. గాంధీ మార్చురీ వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్ నేతలు, వివిధ ప్రజాసంఘాల నేతలు.. బోరున విలపిస్తున్న స్వేచ్ఛ తండ్రిని ఓదార్చారు. అంత దు:ఖంలోనూ స్వేచ్ఛ కుటుంబం సభ్యులు.. ఆమె కళ్లను దానం చేశారు. దీంతో స్వేచ్ఛ కళ్లను గాంధీ వైద్యులు సేకరించారు.


ఇవి కూడా చదవండి

దేశ రాజధానిలో బోనాల జాతర

యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 28 , 2025 | 02:56 PM