CM Revanth Reddy: టోనీ బ్లెయిర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ABN , Publish Date - Jun 19 , 2025 | 07:18 PM
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. గంటసేపు ఈ భేటీ కొనసాగింది.ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

ఢిల్లీ: బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌తో (Tony Blair) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ(గురువారం) ఢిల్లీలో సమావేశం అయ్యారు. గంటసేపు ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రెండో వార్షికోత్సవం సందర్భంగా ఆవిష్కరించే 'తెలంగాణ రైజింగ్ 2047' కార్యక్రమ వివరాలను ముఖ్యమంత్రి టోనీ బ్లెయిర్‌కి అందజేశారు. రైతులు, యువత, మహిళలు వంటి వివిధ వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి, మానవ అభివృద్ధి సూచికల మెరుగుదలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా వివరించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
కోర్ అర్బన్, పెరి-అర్బన్, గ్రామీణ మండలాలతో మైక్రోప్లానింగ్‌కి సంబంధించిన విషయాలను టోనీ బ్లెయిర్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పంచుకున్నారు. అభివృద్ధి ఏజెండా స్థిరత్వ సూత్రాల ద్వారానే సాధించవచ్చని ఈ సందర్భంగా టోని బ్లెయిర్ పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి అంశాలపై టోని బ్లెయిర్ ప్రత్యేక ఆసక్తిని కనబరిచారని సీఎం కార్యాలయం పేర్కొంది. తెలంగాణ రైజింగ్ విజన్ డెవలప్‌మెంట్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం, టోని బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు సీఎంఓ ప్రకటించింది.
మెట్రో ఫేజ్-IIకి కేంద్రం సహకరించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ఫేజ్-IIకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్-II అవసరం ఎంతో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు. రూ.24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌ని కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్ట్‌గా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు సీఎం రేవంత్‌రెడ్డి.
మెట్రో ఫేజ్-II సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులపై రద్దీ తగ్గుతోందని.. సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి ఖట్టర్‌కు తెలిపారు. పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్ట్ డీపీఆర్ సమర్పించిన విషయాన్ని కేంద్రమంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-II ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్రమంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ
యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత
ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News