Sigachi Company: పాశమైలారం సిగాచి కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు
ABN , Publish Date - Jul 02 , 2025 | 09:44 AM
పఠాన్‌చెరు మండలంలోని పాశమైలారం సిగాచి కంపెనీలో జూన్ 30న భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 36 మంది కార్మికులు మృతిచెందారు. కార్మికులు చనిపోవడంతో సిగాచి కంపెనీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంగారెడ్డి: పఠాన్‌చెరు మండలంలోని పాశమైలారం సిగాచి కంపెనీలో (Sigachi Company) జూన్ 30వ తేదీన భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 36 మంది కార్మికులు మృతిచెందారు. కార్మికులు చనిపోవడంతో సిగాచి కంపెనీ మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదైంది. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే 36 మంది కార్మికులు మరణించారని బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. బీఎన్ఎస్ 105, 110,117 సెక్షన్ల కింద బీడీఎల్ భానూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యశ్వంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రత్యేక టీమ్ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సిగాచి యాజమాన్యంపై ప్రభుత్వం సీరియస్
సిగాచి యాజమాన్యం వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికీ కూడా ఘటన స్థలానికి సిగాచి ఎండీ చేరుకోలేదు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నిన్న (మంగళవారం) పరిశీలించారు. ఈ సందర్భంగా సిగాచి ప్రతినిధులపై సీఎం సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై కంపెనీ యజమాన్యం నిర్లక్ష్యం వహించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడచిన ఘటన స్థలానికి ఇంకా రాకపోవడంతో కఠిన చర్యలు తప్పవని సిగాచి ఎండీని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
11 మంది కార్మికుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి..
మరోవైపు.. పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 46కు చేరింది. ఘటనాస్థలిలో 44 మంది, చికిత్స పొందుతూ మరో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఆస్పత్రుల్లో 35 మందికి చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికే 11 మంది కార్మికుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు.
సిగాచి పరిశ్రమలో వర్షం కారణంగా సహాయక చర్యలు నిలిచిపోయాయి. నిన్న(మంగళవారం) రాత్రి నుంచి భారీ వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. సహాయక చర్యలు చేపట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో సహాయక చర్యలను నిలిపివేశారు. ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం శిథిలాలను ఇంకా తొలగించలేదు. ఈ ప్రమాదంలో మరో నలుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు. గల్లంతైన కార్మికులు ఈ శిథిలాల కింద ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఘటన స్థలికి వచ్చి పరిశీలించాకే సహాయక చర్యలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
పేలుడు ఘటనలో గందరగోళం..
సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో గందరగోళం నెలకొంది. 143 మందే కార్మికులు డ్యూటికి వచ్చినట్లుగా ప్రభుత్వ అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఇప్పటి వరకు మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై స్పష్టత రాలేదు. అధికారుల లెక్కల ప్రకారం 36 మంది మృతి, 34 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు 45 మంది చనిపోయినట్లు తెలుస్తున్నా అధికారులు ధ్రువీకరించలేదు. అధికారులు చెబుతున్న లెక్కకు, మార్చురీ వద్ద మృతదేహాల లెక్కలకు మధ్య తేడా ఉంది. క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు అధికారులు వివరాలు చెప్పలేకపోతున్నారు.
ఇవి కూడా చదవండి
AP Deputy CM: నటి పాకీజాకు పవన్ ఆపన్నహస్తం
Read Latest Telangana News And Telugu News