Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు
ABN , Publish Date - Jun 21 , 2025 | 09:47 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కాజీపేట రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన విడుదలయ్యారు. బెయిల్‌పై విడుదలైన కౌశిక్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసానికి బయలుదేరారు.

హనుమకొండ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి (BRS MLA Padi Kaushik Reddy) కాజీపేట రైల్వేకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన విడుదలయ్యారు. బెయిల్‌పై విడుదలైన కౌశిక్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసానికి బయలుదేరారు. కౌశిక్‌రెడ్డి జైలు నుంచి విడుదలవడంతో బీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకున్నారు. ఇవాళ(శనివారం) ఉదయం కౌశిక్‌రెడ్డిని హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. చివరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈనెల 25వ తేదీ వరకు ఇద్దరు షూరూటీలను ఇవ్వాలని కాజీపేట రైల్వే కోర్టు ఆదేశించింది. అంతకుముందు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిని బెదిరించిన కేసులో రిమాండ్ విధించింది. అయితే వాదనలు పూర్తి అయిన తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కౌశిక్‌రెడ్డికి బెయిల్ తర్వాత మీడియాతో బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు.
నాపై అక్రమ కేసులు పెట్టారు: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
తనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. తనపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష గట్టిందని మండిపడ్డారు. తనను నిన్న(శుక్రవారం) రాత్రి ఒంటి గంట నుంచి పోలీసులు ఇబ్బంది పెట్టారని చెప్పారు. తనను రేవంత్‌రెడ్డి జైలుకు పంపాలని చూసినా...కేసీఆర్ నాయకత్వంలో ఏకే 47లా తయారవుతానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే పనుల్లో 20 శాతం కమీషన్లు తీసుకుంటోందని ఆరోపించారు. మంత్రి సీతక్క ఇసుక క్వారీల దందా బయట పెడుతానని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి రైతుల భూములు లాకుంటున్నారని మండిపడ్డారు. నాగరాజు డబ్బులు తీసుకొని పోస్టింగ్‌లు ఇస్తున్నారని ఆరోపించారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అక్రమాలను బహిర్గతం చేస్తానని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు: బోయినపల్లి వినోద్ కుమార్
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై చాలా అక్రమ కేసులు పెడుతోందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని.. పోలీస్‌లతో ఇబ్బంది పెడుతోందని అన్నారు. నాలుగు గంటల పాటు పాడి కౌశిక్‌రెడ్డి కేసుపై కోర్టు విచారణ చేపట్టిందని తెలిపారు. విచారణ అనంతరం కోర్టు బెయిల్ ఇచ్చిందని అన్నారు. చట్టంపై తమకు ఉన్న విశ్వాసం గెలిచిందని చెప్పుకొచ్చారు. పోలీసులు తప్పుడు రిమాండ్ రిపోర్ట్ సమర్పించడంతో న్యాయమూర్తి మొదట బెయిల్ రిజెక్ట్ చేశారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ లీగల్ సెల్ గొప్పగా వాధించింది: ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హస్తం ఉందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ను బద్నామ్ చేయాలనే తమ ఎమ్మెల్యేపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దీ రోజులే ఉంటుందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడితోనే పోలీస్‌లు తప్పుడు కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. కౌశిక్‌రెడ్డికి బెయిల్ విషయంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ కోర్టులో గొప్పగా వాధించడంతో విజయం సాధించామని అన్నారు. న్యాయం గెలిచిందని చెప్పారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన్ని తరిమి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయని ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు.
అక్రమ కేసులను తిప్పి కొడుతాం: వినయ్ భాస్కర్
తమ నేతలపై పెట్టే అక్రమ కేసులను తిప్పి కొడుతామని బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ అన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన పార్టీ తమదని చెప్పారు. బీఆర్ఎస్ శ్రేణులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కడిగిన ముత్యంలా బయటకు వస్తామని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సిట్ ముందుకు ప్రణీత్ రావు.. 650 ఫోన్ల ట్యాప్‌పైనే విచారణ
యోగా డేలో తొక్కిసలాట.. స్పృహకోల్పోయిన యువతి
భార్యపై అనుమానం.. బిడ్డలపై ఘాతుకం... రవిశంకర్ అరెస్ట్
Read latest Telangana News And Telugu News