Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రవీణ్ కుమార్ యూటర్న్
ABN , Publish Date - Jul 28 , 2025 | 12:47 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మాజీ పోలీస్ ఉన్నతాధికారి, బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం హాజరయ్యారు. విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ప్రవీణ్ కుమార్‌కి సిట్ అధికారులు రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) విచారణకు మాజీ పోలీస్ ఉన్నతాధికారి, బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (BRS Leader RS Praveen Kumar) ఇవాళ (సోమవారం జులై 28) హాజరయ్యారు. విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ప్రవీణ్ కుమార్‌కి సిట్ అధికారులు రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తన ఫోన్ బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని, ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడుతోందని గతంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ప్రవీణ్ కుమార్ ఈసీ, డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు ఆధారంగానే సిట్ అధికారులు విచారణకు పిలిపించారు. ప్రవీణ్ కుమార్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రవీణ్ కుమార్ స్టేట్‌మెంట్ ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ప్రవీణ్ కుమార్ వాంగ్మూలం ఇచ్చాడా అనేది చర్చనీయాంశంగా మారింది.
ప్రవీణ్ కుమార్ యూటర్న్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రవీణ్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని, కేసీఆర్ తన ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై పంజాగుట్టలో ఎఫ్ఐఆర్ నమోదైంది. పంజాగుట్టలో నమోదైన ఎఫ్ఐఆర్‌పై ప్రవీణ్ కుమార్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు సిట్ అధికారులు. యాపిల్ మొబైల్‌కి అలర్ట్ మెసేజ్ రావడంతో గతంలో ఫిర్యాదు చేశానని తెలిపారు ప్రవీణ్ కుమార్. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ప్రవీణ్ కుమార్.
ఫోన్ ట్యాపింగ్‌ను బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోలేదని ఇప్పుడు మాట మార్చారు ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్‌కి అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. అప్పటి ఫిర్యాదుపై వాంగ్మూలం ఇవ్వమంటే , సీఎం రేవంత్‌రెడ్డిపై ఆయన ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, తన ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నట్లు సిట్‌కి ఫిర్యాదు చేశారు. డార్క్ వెబ్‌సైట్‌లో టూల్స్ ఉపయోగించి ప్రైవేటు వ్యక్తులతో ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ను పావుగా వాడుకుంటోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రవీణ్ కుమార్ విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జీవితాంతం గ్రీన్ చాలెంజ్ కొనసాగిస్తా: సంతోష్
బీటెక్ బయో టెక్నాలజీలో మరిన్ని సీట్లకు అనుమతి
Read latest Telangana News And Telugu News